పారో.. ఆ 50 మంది డేర్ డెవిల్స్ తప్ప ఎవరూ విమానం నడపలేరో..

విమాన ప్రయాణం ఇప్పుడు సాధారణ ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది.. థర్డ్ గ్రేడ్ నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయి

Update: 2024-09-22 15:30 GMT

విమాన ప్రయాణం ఇప్పుడు సాధారణ ప్రజలకూ అందుబాటులోకి వచ్చింది.. థర్డ్ గ్రేడ్ నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటవుతున్నాయి.. ప్రభుత్వాలు, విమానయాన సంస్థలు విమానాలను సాధారణ తరగతులకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ దేశాలు తమ గడ్డ మీదకు రమ్మంటూ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అయితే, ట్రైనింగ్ పొందిన పైలట్లు ప్రపంచంలో ఎక్కడైనా విమానం ల్యాండ్ చేయగలరు. కానీ, ఆ రన్ వే మీద తప్ప.

ప్రశాంతం దేశంలో..

భూటాన్.. భారత్ కు పొరుగు దేశం. ప్రపంచంలో ప్రశాంత జీవనానికి పేరుగాంచింది. ఇక్కడి ప్రజల ఆలోచనా ధోరణులు కూడా అదే విధంగా ఉంటాయి. జీవన ప్రమాణాలూ అధికమే. ఇక భూటాన్ భారత్ తో అత్యంత సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అత్యంత చిన్న దేశమే అయినా సరిహద్దులో కీలకం. పైగా భూటాన్ కు భారత్-చైనాతో సరిహద్దు ఉంది. ఇలాంటి దేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విమానాశ్రయం ఉంది.

హిమాలయాల పాదాల్లో

భూటాన్‌ లోని పారో ఎయిర్‌ పోర్టు ఒకటి. చుట్టూ 18 వేల అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలుంటాయి. అందుకే ఇక్కడ ల్యాండింగ్ చేయాలంటే విమాన పైలట్లకు మహా సవాల్. ప్రపంచంలోని 50 మంది పైలట్లు మాత్రమే ఇక్కడ విమానం ల్యాండింగ్ కు అర్హత సాధించారు. ఎందుకంటే.. ఈ ఎయిర్ పోర్టు రన్‌ వే పొడవు కేవలం 7,431 అడుగులు. చిన్న విమానాలకు మాత్రమే ల్యాండింగ్‌ సాధ్యం. పైగా రాడార్‌ మార్గ నిర్దేశం లేకుండా నడపడానికి శిక్షణ పొందిన పైలట్లు అయితేనే ల్యాండ్ చేయగలరు. ఏమాత్రం తప్పు జరిగినా విమానం ప్రమాదానికి గురవుతుంది. కాగా, పారో ఎయిర్‌ పోర్టులో ల్యాండింగ్‌ కు అర్హత పొందిన పైలట్లు కేటగిరి-సి కిందకు వస్తారు. వీరిని విమానయాన రంగంలో డేర్‌ డెవిల్స్‌ తో పోలుస్తారు.

పర్వతాల భూటాన్

అత్యంత చిన్న దేశమైన భూటాన్ లో హారన్ కొట్టడం కూడా నిషేధం. ప్రజా జీవనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ఇక్కడ. ఈ దేశంలో 97 శాతం భూ భాగం పర్వతాలతో నిండి ఉంటుంది. పారో విమానాశ్రయం సముద్ర మట్టానికి 7,382 అడుగుల ఎత్తులో ఉంటుంది. వాతావరణ మార్పులు, గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ విమాన ప్రయాణాలు నిలిపివేస్తారు. వర్షా కాలంలో గోల్ఫ్‌ బంతి అంతటి వడగళ్లు పడుతుంటాయి. రాడార్‌ సంకేతాలు సరిగా పనిచేయవు. అందుకని రాత్రిళ్లు ల్యాండింగ్ ఉండదు.

Tags:    

Similar News