120 కి.మీ. దూరాన్ని జస్ట్ 12 గంటల్లో ఫినిష్ చేశారు
నమ్మకాలకు మించింది మరొకటి లేదు. తాము బలంగా నమ్మిన దాని కోసం ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే చెందింది
నమ్మకాలకు మించింది మరొకటి లేదు. తాము బలంగా నమ్మిన దాని కోసం ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే చెందింది. ఎంతటి తోపులైనా సరే.. గంటకు 7కి.మీ. మించి నడవలేరని చెబుతుంటారు. సరాసరిన గంటకు ఐదారు గంటలు నడవటే ఎక్కువ. అలాంటిది కేవలం పన్నెండు గంటల వ్యవధిలో ఏకంగా 120కి.మీ. నడిచిన ఇద్దరు మిత్రుల కథ ఇది. ఇంతకూ వారంత దూరం ఎందుకు నడిచారన్న ప్రశ్నకు.. దేవుడి మొక్కు అంటూ చెప్పే సమాధానం విన్నంతనే ఆసక్తికరంగా అనిపించటమే కాదు.. అసలు విషయం తెలుసుకోవాలన్న కూతుహలం వ్యక్తం కావటం ఖాయం.
కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులకు తాము నమ్మే కుల దైవం ఎల్లమ్మ తల్లిపై అపారమైన గురి. తమకున్న భక్తిని ప్రదర్శించుకోవటానికి వీలుగా.. తమ గ్రామం నుంచి 60కి.మీ. దూరంలో ఉన్న గుడికి వచ్చి.. తిరిగి వెళతామని.. అది మొత్తం 12 గంటల్లో పూర్తి చేస్తామంటూ మొక్కుకున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని కలఘట్టి తాలుకాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. దేవుడికి తాము మొక్కుకున్న మొక్కు కోసం పదకొండు మంది యువకులు తమ సాహసయాత్రను ప్రారంభించారు.
ఉదయం ఆరు గంటలకు యాత్రను ప్రారంభించిన ఈ యువకులటీంలో ఇద్దరు మాత్రం.. మొక్కుకున్నట్లుగా పన్నెండు గంటల వ్యవధిలో 120కి.మీ దూరంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని గ్రామానికి తిరిగి వచ్చారు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత దూరాన్ని నడిచిన వైనం గ్రామస్తుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మహంతేష్.. గంగప్ప గిరెప్ప గౌడ లను పలువురు అభినందిస్తున్నారు. వారికి గ్రామస్తులు సన్మానం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.