యనమల రిటైర్మెంట్ కంఫర్మ్ ?

టీడీపీలో పునాదుల నుంచి ఉన్న నాయకుడు యనమల రామక్రిష్ణుడు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిన విషయమే

Update: 2025-01-11 03:15 GMT

టీడీపీలో పునాదుల నుంచి ఉన్న నాయకుడు యనమల రామక్రిష్ణుడు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత సన్నిహితులో అందరికీ తెలిసిన విషయమే. ఆయన రాజకీయ మేధావిగా గుర్తింపు పొందారు. ఆయన ఆర్ధిక మంత్రిగా టీడీపీలో రికార్డు సృష్టించారు. ఇక స్పీకర్ గా ఆయనకు మంచి పేరుంది. ఆయన ఇచ్చిన రూలింగ్స్ కూడా ఇప్పటికీ సంప్రదాయాలుగా కొనసాగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరోలో పెద్ద తలకాయగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితం 42 ఏళ్ళు పై దాటింది. ఈ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అయన ఎపుడూ పదవిలో లేకుండా ఖాళీగా ఉన్నది బహు తక్కువ. ఆయన అనేక సార్లు అసెంబ్లీకి అలాగే రెండు సార్లు శాసనమండలికి ఎన్నిక అయ్యారు.

అటువంటి యనమల రాజకీయం మార్చి 30తో ముగియబోతోందా అన్న చర్చ అయితే ఉంది. ఆయన ఈ మార్చి 30తో శాసనమండలి నుంచి ఎమ్మెల్సీగా రిటైర్ కాబోతున్నారు. మళ్లీ ఆయనకు అక్కడ బెర్త్ ఉంటుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక 2026లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో కూడా ఆయనకు ఒక చోటు ఉంటుందా అంటే అది కూడా డౌటే అంటున్నారు.

మొత్తానికి చూస్తే టీడీపీని దశాబ్దాల పాటు శాసించి పెద్ద నాయకుడిగా ఉన్న యనమల రాజకీయ జీవితం ఇలా అనుహ్యంగా ఆగిపోతుందా అంటే పరిణామాలు అలాగే ఉన్నాయి. ఆయన ఇటీవల కాకినాడ పోర్ట్ గురించి మాట్లాడుతూ బీసీలకు అన్యాయం అని కొన్ని కీలక కులాలను ప్రస్తావించడంతో ఆయన బాబుకు రాసిన బహిరంగ లేఖ కూడా సంచలనం అయింది.

దాంతో నాటి నుంది అధినాయకత్వంతో ఆయనకు గ్యాప్ అయితే వచ్చింది అని అంటున్నారు. దాంతో పాటుగా మరో ప్రచారం కూడా ఉంది. అదేంటి అంటే అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ ఆయనకు దొరకడం లేదని. యనమల పార్టీకి ఇరుకున పెట్టే విధంగా లేఖ రాశారు అన్నది కూడా ఉందిట.

దాంతో పాటు హై కమాండ్ కి యనమలకు మధ్య గ్యాప్ వచ్చింది అన్నది గ్రహించిన గోదావరి జిల్లా నాయకులు కూడా ఆయనకు దూరంగా జరుగుతున్నారుట. ఈ మొత్తం పరిణామాలను చూస్తే కనుక యనమల రాజకీయ జీవితానికి పెద్ద ఫుల్ స్టాప్ పడబోతోంది అని అంటున్నారు. యనమలకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చామని అయినా ఆయన హై కమాండ్ కి ఇబ్బంది పెట్టేలా ఇటీవల లేఖ రాయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఈ మొత్తం విషయాలను గమనిస్తే కనుక యనమలకు ఇక రిటైర్మెంట్ ఖరారు అనే అంటున్నారు.

అయితే యనమల ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్లమెంట్ కి ఒకసారి అయినా వెళ్ళాలని అనుకున్నారు. అది కూడా రాజ్యసభ సభ్యునిగా చేయాలని అనుకున్నారు. అయితే అది ఇపుడు నెరవేర అవకాశాలు లేవని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ సీనియర్ లీడర్ కి ఇక రెస్ట్ అనే అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజానిజాలు ఎంత వరకూ ఉన్నాయో.

Tags:    

Similar News