లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ
తాజాగా యార్లగడ్డ చేరికతో గన్నవరంలో టిడిపి మరింత బలపడుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్, వైసీపీ మాజీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్న రీతిలో కొద్ది నెలలుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మౌనాన్ని వీడిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన యార్లగడ్డ వెంకట్రావు....చంద్రబాబు ఆదేశిస్తే గుడివాడ నుంచి అయినా విజయవాడ నుంచి అయినా గన్నవరం నుంచి అయినా...ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని, లోకేష్ గన్నవరం పర్యటన సందర్భంగా ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది.
ఆ ప్రచారానికి తగ్గట్టుగానే తాజాగా గన్నవరం నియోజకవర్గం నిడమనూరులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరారు. యార్లగడ్డకు పసుపు కండువా కప్పి పార్టీలోకి లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరే ముందు యార్లగడ్డతో లోకేష్ కాసేపు మాట్లాడారు.
యార్లగడ్డ టిడిపిలో చేరుతున్న సందర్భంగా ఆయన వెంట టిడిపి నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు ఉన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు వారంతా శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా యార్లగడ్డ చేరికతో గన్నవరంలో టిడిపి మరింత బలపడుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. వల్లభనేని వంశీ వైసిపి తరఫున పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో వంశీకి దీటుగా యార్లగడ్డ పోటీనిస్తారని స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక, గత ఎన్నికల్లో గన్నవరం ఎన్నికల బరిలో వల్లభనేని వంశీ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో యార్లగడ్డ ఓటమిపాలైన సంగతి తెలిసింది. ఈసారి యార్లగడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కష్టమని, ఎమ్మెల్సీ లేదా వేరే విధంగా న్యాయం చేస్తామని వైసిపి పెద్దలు ఆయనతో అన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని యార్లగడ్డ పట్టు బట్టడంతో ఉంటే ఉండు పోతే పో అన్న రీతిలో సజ్జల మాట్లాడారని యార్లగడ్డ మీడియా సాక్షిగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.