బాబుతో యార్లగడ్డ భేటీ...వంశీ మీద పోటీ...?

ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆదివారం యార్లగడ్డ బాబుతో భేటీ కానున్నారు.

Update: 2023-08-19 16:34 GMT

వైసీపీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న విజయవాడ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరడం లాంచనం అయిపోయింది. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆదివారం యార్లగడ్డ బాబుతో భేటీ కానున్నారు. ఆయన ఈ నెల 21న గన్నవరంలో జరిగే నారా లోకేష్ బహిరంగ సభలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

ఇక యార్లగడ్డ 2024లో గన్నవరం నుంచి పోటీకి తయారుగా ఉన్నారు. ఈసారి తాను పోటీకి సిద్ధమని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. పార్టీ మాత్రం చెప్పను అని అన్నారు. ఇపుడు ఆయన పార్టీ కూడా తెలిసిపోతోంది. ఆయన టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయనున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపు వచ్చారు.

ఆయనకే 2024లో టికెట్ కన్ ఫర్మ్ అయింది. దాంతో యార్లగడ్డ టీడీపీ వైపు వస్తున్నారు. ఇక వైసీపీలో ఉన్న మరో నేత దుట్టా రామంచంద్రరావు రూట్ ఏంటో తెలియాల్సి ఉంది. ఆయన 2014లో వంశీ మీద పోటీ చేసి ఓడారు. ఈ మధ్యనే ఆయనతో కూడా యార్లగడ్డ చర్చలు జరిపారు. మరి ఆయన కూడా పసుపు కండువా కప్పుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరో వైపు చూస్తే గన్నవరంలో వంశీని ఓడించడం అంత తేలిక కాదు, ఆయనకు స్థాన బలం గట్టిగా ఉంది. దాంతో పాటు అధికార పార్టీ నుంచి 2024 లో తలపడనున్నారు. అలా చూసుకుంటే ఆయనను ఓడించాలని టీడీపీకి కూడా పట్టుదల ఉంది కానీ దానికి యార్లగడ్డ సరిపోతారా అన్నదే చూడాల్సి ఉంది.

ఇంకో వైపు చూస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న గద్దే రామ్మోహన్ ని గన్నవరం నుంచి పోటీకి దింపాలని టీడీపీ ఆలోచిస్తోంది. ఆయనే సరైన క్యాండిడేట్ వంశీని ఓడించడానికి అని నమ్ముతోంది అని అంటున్నారు. గతంలో ఒకసారి ఆయన గన్నవరం నుంచి గెలిచిన చరిత్ర కూడా ఉంది. అదే సమయంలో విజయవాడ తూర్పు సీటుని వంగవీటి రాధాక్రిష్ణకు ఇవ్వడం కోసమైనా గద్దే రామ్మోహన్ ని ఇటు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో చంద్రబాబు యార్లగడ్డకు ఏ రకమైన హామీ ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఒక వేళ జగన్ చెప్పినట్లుగానే పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పార్టీని గెలిపించమని చెబుతారా అన్న చర్చ ఉంది. కానీ యార్లగడ్డ మాత్రం ఎమ్మెల్యేగా పోటీకే సిద్ధం అవుతున్నారు. చంద్రబాబు ఏ హామీ ఇస్తారో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News