మహా నేత పేరిట.. 86 ఏళ్ల వయసులో కేంద్ర మాజీ మంత్రి కొత్త పార్టీ

భారత రాజకీయాల్లో సంచలనంగా మారేలా కనిపించారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్.

Update: 2024-09-16 22:30 GMT

భారత రాజకీయాల్లో సంచలనంగా మారేలా కనిపించారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్. దూకుడైన స్వభావంతో నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో అనుచరులను సంపాదించుకున్నారు. మరికొంత కాలం ఆయన జీవించి ఉంటే గనుక ఏం జరిగేదో తెలియదు కానీ.. అనూహ్యంగా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అప్పటికి ఆమె తల్లి ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా అత్యంత బలమైన స్థితిలో ఉన్నారు. ఇక సంజయ్ మరణం తర్వాత ఆయన భార్య మేనకా గాంధీ తన నెలల పసికందు వరుణ్ గాంధీతో కలిసి అత్తింటి నుంచి బయటకు వచ్చేశారు.

ఆంధ్రాతో అనుబంధం.. 4 చోట్ విజయం

అత్త ఇందిరా గాంధీతో విభేదించిన మేనకా.. ఏకంగా తన భర్త సంజయ్ గాంధీ పేరిట 1983 ఏప్రిల్ 3న రాష్ట్రీయ సంజయ్ విచార్ మంచ్ ను ఏర్పాటు చేసి సంచలనం రేపారు. ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశంతో పొత్తు పెట్టుకుని, ఆ పార్టీ అఖండ విజయంలో భాగమయ్యారు. ఐదు సీట్లు పొంది నాలుగు స్థానాల్లో నెగ్గారు. అయితే, సంజయ్ విచార్ మంచ్ ను న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రారంభించిన మేనకా గాంధీ 1988 అప్పటి ప్రధాన ప్రతిపక్షం జనతాదళ్ లో విలీనం చేశారు. అలా రాష్ట్రీయ సంజయ్ విచార్ మంచ్ (ఆర్ఎస్వీఎం) కథ ఐదేళ్లలోనే ముగిసింది.

మరో విచార్ మంచ్ తో యశ్వంత్

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ప్రస్తుత వయసు 86. ఈ వయసులో ఆయన అటల్ విచార్ మంచ్ అంటూ కొత్త పార్టీని స్థాపించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన పేరు వచ్చేలా 'అటల్ విచార్ మంచ్' అని పేరుపెట్టారు. జార్ఖండ్‌ లోని హజారీబాగ్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. రెండు-మూడు నెలల్లో జగరనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగే వయసులో యశ్వంత్ సిన్హా పార్టీని స్థాపించడం గమనార్హం. అయితే, ఈ యన నేపథ్యం సాధారణమైనది కాదు. ఐఏఎస్ అధికారి అయిన యశ్వంత్ సిన్హా.. 1977లో బిహార్ ముఖ్యమంత్రి, ఈ ఏడాది భారత రత్న ప్రకటించిన కర్పూరీ ఠాకూర్‌ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేయడం విశేషం.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో..

ఐఏఎస్ గా 1984లో రాజీనామా చేసిన యశ్వంత్.. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. హజారీబాగ్ నుంచి 1988, 1999, 2009ల్లో ఎంపీగా గెలుపొందారు. వాజ్‌ పేయీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2004 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక 2014లో ఈయన పెద్ద కుమారుడు జయంత్ సిన్హాను బీజేపీ హజారీబాగ్ లో పోటీకి దింపగా ఆయన గెలుపొందారు. తనను పక్కనపెట్టడంపై యశ్వంత్ బీజేపీని మరీ ప్రత్యేకించి మోదీని తీవ్రంగా విమర్శిస్తుంటారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. మళ్లీ ఇప్పుడు సొంతంగా పార్టీని పెట్టారు. ఇటీవల మద్దతుదారులతో భేటీ అయిన యశ్వంత్ సిన్హా.. కొత్త రాజకీయ ప్రయాణపై మంతనాలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో అటల్ విచార్ మంచ్ పోటీకి దిగనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News