నోరు విప్పితేనే నిలబడేది.. జగన్‌కు బోధపడని నిజాలు.. !
నిజానికి జగన్ చేసిన మంచి ఏదైనా ఉండి ఉంటే.. ప్రజలు గుర్తించి ఉంటే.. అసలు 11 స్థానాలకే ఎందు కు పరిమితం అవుతారనేది ప్రశ్న.
అదేంటో కానీ.. వైసీపీ అధినేత జగన్‌కు నిజాలు ఇంకా బోధ పడడం లేదు. ఇంకా ఆయన భ్రమల్లోనే ఉ న్నారని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు ఆయనలో అయితే మార్పు కనిపించడం లేదన్నది ఇప్పుడు పార్టీలోనూ పెద్దచర్చగా మారింది. ఆయనకు మాట్లాడడం రాదు. తానేదో చేశానని.. ఇప్పుడు అదే పాటించాలని అంటారు. కానీ, జనం నాడి వేరేగా ఉంది. తెరచాటున ఉండి ఏం చేసినా.. పెద్దగా ప్రొజెక్టు కాదు.
నిజానికి జగన్ చేసిన మంచి ఏదైనా ఉండి ఉంటే.. ప్రజలు గుర్తించి ఉంటే.. అసలు 11 స్థానాలకే ఎందు కు పరిమితం అవుతారనేది ప్రశ్న. చేసిన మంచిని ఆనాడు చెప్పుకోనివ్వలేదు. కేవలం తన భజన కోసమే ఎమ్మెల్యేలను ఇంటింటికీ తిప్పారన్నవాదనా ఉంది. ఇదే పెద్ద మైనస్‌గా మారిపోయింది. జగన్-జగన్.. నామస్మరణలో మునిగి తేలిన నాయకులు.. తమను తాము మరిచిపోయారు. తమ సత్తాను ఎన్నడో విస్మరించారు.
ఫలితంగా జగన్‌ను బూచిగా చూపించడంలో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇదే పార్టీ పతనానికి కారణమైంది. అలా కాకుండా.. నియోజకవర్గానికో జగన్‌ను నిలబెట్టి నిలదొక్కుకుని ఉంటే.. నాయకులకు పగ్గాలు ఇచ్చి ఉంటే.. పరిస్థితి వేరేగా ఉండేది. ఇక, ఇప్పుడుకూడా అదే సూత్రం పాటిస్తున్నారు. ఎవరినీ నోరు విప్పనివ్వడం లేదు. ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. అంతా నేనే చూసుకుంటానన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఫలితంగా బలమైన గళం వినిపించే నాయకులు.. బలంగా ఎదుర్కొనే నాయకులు కూడా ఎవరూ ముందు కు రాలేదు. రావడం లేదు. కాదుకాదు.. రానివ్వడమూ లేదు. ఇది అంతిమంగా వైసీపీ పతనానికే కారణ మైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జగన్ పాఠాలు నేర్చుకుని నిజాల వెంట పరుగులు పెడితే.. కొంతలో కొంతైనా.. తేరుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు ఆస్పృహే లేకుండా పోయింది. మరి ఎప్పటికి జగన్ మారుతారో అని వైసీపీనాయకులు ఎదురు చూస్తున్నారు.