బీజేపీ గెలవడమే ఏపీలో ఆ పార్టీకి మేలు ?

ఏది ఏమైనా కనుక చూస్తే దేశంలో కాంగ్రెస్ బీజేపీతో ముఖా ముఖీ పోరులో గెలిచేందుకు ఇంకా గట్టిగా కష్టపడాలని తాజా ఫలితాలు చెబుతున్నాయి.

Update: 2024-10-09 13:30 GMT

దేశ రాజకీయ పరిణామాలు రాష్ట్రాల మీద పడతాయి. వాటి వల్లనే ప్రజల మూడ్ మారుతుంది. దాంతో ప్రాంతీయ పార్టీల రాజకీయ జాతకాలూ మారుతాయి. ఎవరు కాదన్నా దేశంలో రెండే రెండు పెద్ద జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి బీజేపీ కాంగ్రెస్. అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లకు చెందిన కూటములలోనే ప్రాంతీయ పార్టీలు చేరాల్సి ఉంటుంది.

తటస్థ రాజకీయాలు అధికారంలో ఉన్నపుడు చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ విపక్షంలో అలా చెల్లదు. ఇక దేశంలో ఎన్డీయే కూటమికి బీజేపీ నాయకత్వం వహిస్తూంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది.

బీజేపీ బలపడితే ఏపీలోని కొన్ని పార్టీలకు అలాగే కాంగ్రెస్ బలపడితే మరి కొన్ని పార్టీలకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆయా పార్టీలకు ఈ రెండింటితో భావసారూప్యం ఉంటుంది. బీజేపీ అంతకంతకు బలపడితే ఏదో నాటికి ఏపీ మీద తన ప్రభావం చూపిస్తుంది అని టీడీపీ లాంటి పార్టీలకు ఉండడం సహజం.

ఏపీలో టీడీపీ బీజేపీ ఓటు బ్యాంక్ దాదాపుగా ఒక్కటిగానే ఉంటాయి. ఇక కాంగ్రెస్ బలపడితే ఏపీలో కూడా ఏపీలో వైసీపీ లాంటి పార్టీలకు ఇబ్బంది. ఎందుకంటే వైసీపీ పుట్టిందే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని చీల్చి అన్నది తెలిసిందే.

వైసీపీ పుట్టాక కాంగ్రెస్ జాతీయంగా కృంగిపోతూ వచ్చింది. 2014 తరువాత దేశంలో కాంగ్రెస్ వెలుగులు లేవు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణాలో కాంగ్రెస్ మళ్లీ గెలిచింది. సాటి తెలుగు రాష్ట్రం కావడంతో దాని ప్రభావం ఏపీ మీద ఎంతో కొంత ఉంటుందని భావించినా అటువంటిది ఏమీ లేదని ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తేలిపోయింది.

ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో బాగానే రాణించించి. వంద ఎంపీల మార్క్ కి చేరుకుంది. అంతే కాదు 2029లో దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కూడా అనుకుంటూ వచ్చారు. లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఇండియా కూటమి మంచి ఫలితాలను రాబట్టింది. దాంతో ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో ఇండియా కూటమి బలపడుతుందన్న సంకేతాలూ వచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా జరిగిన రెండు శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తుందని అంతా భావించారు. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పాత్ర పరిమితం అయినా హర్యానా గెలిచి ఉంటే ఆ కధ ఒక లెవెల్ లో ఉండేది అని కూడా అనుకున్నారు. కానీ హర్యానాలో మూడోసారి కూడా బీజేపీ గెలవడంతో కాంగ్రెస్ శిబిరం ఖంగు తింది. ఈ పరిణామంతో దేశంలో కాంగ్రెస్ గమనం మందగిస్తోందా అన్న చర్చ కూడా ఉంది.

కాంగ్రెస్ మిత్రులతో గెలిచి రావడం కాదు, సొంతంగా గెలిస్తే అపుడు సత్తా తెలిసేది అన్న వారూ ఉన్నారు. దాంతో కాంగ్రెస్ ఓటమి అన్నది దక్షిణాదిన ఏపీ లాంటి చోట్ల వైసీపీ వంటి పార్టీలకు కొంత ఉపశమనంగా ఉంది అని విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో అయితే కాంగ్రెస్ 2029 నాటికి కూడా ఎత్తిగిల్లేది పెద్దగా ఉండదని అంతా అంటున్న విషయమే.

అయితే దేశంలో కాంగ్రెస్ గాలి బాగా ఉందని తెలిసితే ఇండియా కూటమితో ఏపీలో కొత్త పొత్తులకు పార్టీలు కలిసే సీన్ ఉంది అలా జరిగినపుడు మాత్రం వైసీపీ ఓటు బ్యాంక్ చెదిరిపోతుంది. అందుకే కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు పడితేనే వైసీపీ ఫ్యాన్ స్పీడు అందుకుంటుందని చెబుతారు.

ఏది ఏమైనా కనుక చూస్తే దేశంలో కాంగ్రెస్ బీజేపీతో ముఖా ముఖీ పోరులో గెలిచేందుకు ఇంకా గట్టిగా కష్టపడాలని తాజా ఫలితాలు చెబుతున్నాయి. దాంతో ఇండియా కూటమి వైపు చూసే పార్టీలకు కూడా ఇప్పట్లో తొందర అవసరం లేదు అనే అంటున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి మేలు చేసేవిగానే ఉంటాయని చెబుతున్నారు.

Tags:    

Similar News