వెయిటింగ్ లిస్టులో వైసీపీ..!
ముఖ్యంగా కూటమి సర్కారుకు వ్యతిరేకత రాలేదని వైసీపీ నాయకలే అంతర్గతంగా చెబుతున్నారు. అందుకే ఎవరికి వారు మౌనంగా ఉన్నారు.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మరింత డైల్యూట్ అవుతుందా? రాబోయే రోజుల్లో ఆ పార్టీ వాయిస్ మరింత సన్నగిల్లనుందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వైసీపీ కార్యక్రమాలన్నీ వాయిదాల పర్వంలోనే ముందుకు సాగుతున్నాయి. సంక్రాంతి సమయానికి పుంజుకుంటానని చెప్పిన జగన్.. తర్వాత ఫిబ్రవరి వరకు వెయిట్ చేయాలని సూచించారు. అయితే.. ఈలోగా.. ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేలా.. సమస్యలను ప్రస్తావించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
దీంతో పార్టీ శ్రేణులు.. ఇప్పటికే ప్రజల మధ్యకు వెళ్లి ఉండాలి. జగన్ ఆదేశాలు.. సూచనల మేరకు నిరసనలు చేసి ఉండాలి. కానీ, ఎక్కడా ఆ ఊపు కనిపించడం లేదు. దీనికి కారణం.. మేలైన రీజన్ వారికి లభించలేదనే అంటున్నారు. అంటే.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చే దశలో ప్రస్తుత రాజకీయాలు లేవని.. ముఖ్యంగా కూటమి సర్కారుకు వ్యతిరేకత రాలేదని వైసీపీ నాయకలే అంతర్గతంగా చెబుతున్నారు. అందుకే ఎవరికి వారు మౌనంగా ఉన్నారు.
``మా నాయకుడు చెప్పినట్టు వింటాం. ప్రజల మధ్యకు వెళ్తాం. కానీ, ఇప్పుడు వ్యతిరేకత ఇంకా వచ్చినట్టు కనిపించడం లేదు. కొంతకాలం వెయిట్ చేస్తాం. ఆ తర్వాతే ప్రజల మధ్యకు వెళ్లాలని అనుకుంటున్నాం `` అని విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, ఇదే మాట అటు ఇటుగా చాలా మంది నాయకుల నుంచే వినిపిస్తోంది. అంటే.. ప్రజల నుంచి కూటమి సర్కారుకు మంచి రెస్పాన్సే ఉందని తెలుస్తోంది. కాబట్టి.. ఇప్పటికిప్పుడు ప్రజల మధ్య కు వెళ్లినా.. ప్రయోజనం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఎప్పటి నుంచి..
ఇక, ప్రస్తుతం వైసీపీ వ్యూహాన్ని పరిశీలిస్తే.. మరో ఆరు మాసాల వరకు ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పైకి ఫిబ్రవరి అని చెబుతున్నా.. ఆ సమయానికి ప్రజలకు సూపర్ సిక్స్‌లో హామీ ఒకటి చేరువ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రజల మధ్యకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత లేకుండా.. తాము చేయగలిగేది ఏమీ లేదని కూడా అంటున్నాయి. సో.. ఎలా చూసుకున్నా వైసీపీ వెయిటింగ్ లిస్టులోనే ఉందన్న వాదన అయితే వినిపిస్తుండడం గమనార్హం.