'చంద్రబాబు ఆర్భాటపు వ్యయాల వివరాలు'... వైసీపీ లెక్కలు!

ఈ సమయంలో... అసలు ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ "బాబు దుబారా" అని ఓ పోస్టర్ విడుదల చేసింది వైసీపీ.

Update: 2024-10-16 04:05 GMT

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలో ఆయన ఇంటి చుట్టూ కట్టిన ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ధ్వజమెత్తారు. ఈ సమయంలో... అసలు ప్రజల సొమ్ము దుబారా చేయడంలో చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అంటూ "బాబు దుబారా" అని ఓ పోస్టర్ విడుదల చేసింది వైసీపీ.


అవును... ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో జగన్, చంద్రబాబులు ప్రజాసొమ్మును ఎంతెంత దుబారా చేశారనే విషయాలపై ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విమర్శలు ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది. ఇందులో భాగంగా... జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇంటి ఇనుప కంచెకు రూ.12.85 కోట్లు ఖర్చు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది.

దీంతో.. చంద్రబాబు 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన విలాసాలు, హంగూ ఆర్భాటాలు, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వందల కోట్లకు పైనే అని చెబుతూ.. క్యాంప్ ఆఫీసులు, వాటి మరమ్మత్తులు, సీసీ కెమెరాల పేరు చెప్పి కోట్లాది రూపాల ప్రజాధనం ఖర్చు చేశారంటూ ఏకంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది వైసీపీ.

హైదరబాద్ లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కోసం రూ.9.47 కోట్లు, మదీనాగూడ ఫాంహౌస్, జూబ్లీహిల్స్ లోని ఇంటికి రూ.4.37 కోట్లు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సీఎం క్యాంప్ ఆఫీస్ విజయవాడకు రూ.42 కోట్లు, తాత్కాలిక సచివాలయం, మరమ్మత్తులకు రూ.1100 కోట్లు, సీఎం ప్రత్యేక బస్సుకు రూ.5.50 కోట్లు, సీఎం కార్యాలయ ఫర్నిచర్ కు రూ.10 కోట్లు ఖర్చు చేశారని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... ప్రత్యేక విమాన ప్రయాణాలు, నవ నిర్మాణ దీక్షలు, పోలవరం ఈవెంట్లు, పోలవరం బస్సు యాత్రలు, ఎన్నికల ముందు ప్రచారాలు, రాజధానిలో సింగపూర్ సెట్టింగులు, గుంటూరు జిల్లాలో ఈవెంట్లు, రాజధాని నిర్మాణానికి ప్రధాన శంకుస్థాపన, తర్వాత మరో మూడు శంకుస్థాపనలు, మొదలైన వాటికి మొత్తంగా చేసిన దుబారా ఖర్చు రూ.3,628.17 కోట్లు అని వైసీపీ పేర్కొంది.

ఈ సందర్భంగా ఎక్స్ లో... "టీడీపీ కూటమి ప్రభుత్వం సిండికేట్ దోపిడీకి తలుపులు బార్లా తెరిచింది. మద్యం మాఫియా దోపిడీకి అధికారికంగా పచ్చజెండా ఊపింది. తమ దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనని జగన్ ఇంటిని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. చంద్రబాబు ఆర్భాటపు వ్యయాల వివరాలు ఒకసారి చూస్తే ఎన్ని వందల కోట్లు దుబారా చేశారో, ప్రజాధనాన్ని ఎలా వాడుకున్నారో అర్ధమవుతుంది" అని పోస్ట్ పెట్టింది.

ఈ టెక్స్ట్ కు "బాబు దుబారా.. గురివింద తనకింద ఉన్న నలుపును ఎరగదన్నట్లుగా బాబు తీరు" అంటూ పోస్టర్ ని జతచేసింది.

Tags:    

Similar News