కీలక వర్గాలతో కనెక్షన్...వైసీపీకి బిగ్ చాలెంజ్ !

అధినేత జగన్ లో అయితే గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి కానీ దానిని ఆయన పార్టీ శ్రేణులకు అందించలేకపోతున్నారని అంటున్నారు.;

Update: 2025-03-24 21:30 GMT

ఏపీలో వైసీపీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకుని దాదాపుగా పది నెలలు గడుస్తున్నాయి. ఈ పది నెలల కాలంలో వైసీపీ ఓటమి నుంచి ఏమైనా తేరుకుందా అంటే జవాబు అసంతృప్తిగానే వస్తోంది. అధినేత జగన్ లో అయితే గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి కానీ దానిని ఆయన పార్టీ శ్రేణులకు అందించలేకపోతున్నారని అంటున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ నుంచి వలసలు అయితే ఆగడం లేదు. పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు వైఎస్సార్ తో జగన్ తో ఎంతో సాన్నిహిత్యం నెరపిన వారు కూడా పార్టీకి దూరం అవుతున్నారు. వారూ వీరు కాదు వైసీపీకు గుండెకాయ అనతగిన విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పేశారు.

ఇక రాజ్యసభ ఎంపీలు నలుగురు ఈ పది నెలల కాలంలో పార్టీకి బై చెప్పారు. ఐదుగురు ఎమ్మెల్సీలు పార్టీని వదిలేశారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ముఖ్య నాయకులు పార్టీలో ప్రభుత్వంలో కీలక స్థానాలలో ఉన్న వారు మంత్రులుగా పనిచేసిన వారు కూడా వైసీపీకి చెక్ చెప్పేస్తున్నారు.

ఈ నేపధ్యంలో వైసీపీ ఎలా కోలుకుంటుంది ఎలా తేరుకుంటుంది అన్నది ఒక పెద్ద చర్చగా ఉంది. వైసీపీ నుంచి వెళ్ళిపోతున్న వారిలో కీలక సామాజిక వర్గాల వారు ఉండడం విశేషం. అలాగే రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాల నుంచే ఈ జంపింగులు ఉంటున్నాయి. మరో వైపు వైసీపీలో కీలక స్థానాలలో పనిచేసిన వారి మీద కేసులు పడుతున్నాయి.

దాంతో కొన్ని సామాజిక వర్గాల వారు మౌన ముద్ర దాలుస్తున్నారు. గోదావరి జిల్లాలలో కాపులు అయితే వైసీపీకి హ్యాండ్ ఇచ్చి కూటమిని గెలిపించారు అని ఎన్నికల విశ్లేషణలు ఉన్నాయి. ఇక చాలా మంది బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వైసీపీని వీడుతారని అంటున్నారు.

అలాగే కోస్తా జిల్లాలలో మరో రకమైన పరిస్థితి ఉంది. రాజకీయంగా బలంగా ఉన్న కమ్మ వారు వైసీపీకి 2019 ఎన్నికల్లో బాగానే సపోర్టు చేశారు. అయితే అమరావతి రాజధాని ఇష్యూతో వారంతా దూరం అయ్యారు వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గం నేతల మీద కేసులు పడడంతో ఆ వర్గం కూడా వైసీపీకి దూరం జరుగుతోంది అని టాక్ వినిపిస్తోంది.

ఇక బీసీలు మొదటి నుంచి టీడీపీనే ఎక్కువగా ఆదరించి ముందుకు సాగుతున్నారు. 2019లో బీసీలలో చీలిక వచ్చి వైసీపీ బాగానే గెలిచింది కానీ 2024 నాటికి వారు కూడా అత్యధిక శాతం కూటమికి జై కొట్టారు. ఇపుడు కూడా బీసీల చూపు కూటమి వైపే ఉందని అంటున్నారు.

ఎస్సీ వర్గీకరణ తరువాత మాదిగలు టీడీపీకి పూర్తిగా కట్టుబడిపోయారు. ఆ వర్గం వైసీపీ వైపు చూసే చాన్స్ లేదని అంటున్నారు. అలాగే మాల సామాజిక వర్గంలో కూడా వైసీపీ షేర్ ఎంత అన్న చర్చ సాగుతోంది. మైనారిటీ సెక్షన్లు టీడీపీ కూటమిని ఆదరించవని అనుకుంటే అది తప్పు అని 2024 ఎన్నికలు రుజువు చేశాయి.

బీజేపీతో పొత్తు ఉండి కూడా టీడీపీ మైనారిటీలను ఆకట్టుకుంటూంటే వైసీపీ తన అసందిగ్ద రాజకీయ విధానాలతో ఎటూ కాకుండా పోతోంది అని అంటున్నారు. ఈ రోజుకీ ఎన్డీయే విషయంలో వైసీపీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఉంటే మైనారిటీలు దళిత వర్గాలు కన్సాలిడేట్ అవుతారు అని అంటున్నారు.

అదే విధంగా వైసీపీ వైపు అని బలమైన ముద్ర ఉన్న రెడ్డి సామాజిక వర్గంలోనూ 2024 ఎన్నికలు చీలిక తెచ్చాయి. వారి విశ్వాసాన్ని వైసీపీ ఎంతమేరకు తిరిగి చూరగొంది అన్నది కూడా మరో హాట్ టాపిక్ గా ఉంది అని అంటున్నారు.

ఇక అగ్ర వర్ణాలుగా ముద్రపడిన బ్రాహ్మిన్స్, వైశ్యాస్, క్షత్రియ వర్గాల మద్దతుని తిరిగి దక్కించుకునే విధంగా వైసీపీ సామాజిక విధానాలు ఎంత మేరకు పునర్ పరిశీలన చేసుకున్నారు అన్నది కూడా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక గడచిన కాలంలో వైసీపీ ఆత్మ పరిశీలన అయితే గట్టిగా చేసుకోలేదని అంటున్నారు.

ఏపీ అంటే కులాల సమాహారం. ఆ సంగతి తెలిసి కూడా వైసీపీ సంక్షేమ పధకాలు అర్బన్ రూరల్ సెక్టార్ అని ఓటర్లను చూస్తూ తమదే విజయం అని భావిస్తోంది అంటున్నారు. మెల్లగా తొలి ఏడాది పూర్తి చేసుకునేందుకు కూటమి అడుగులు వేస్తున్న వేళ వైసీపీ బలమైన వైపక్షంగా నిలబడాలన్నా కీలక వర్గాల మద్దతు దక్కించుకోవాలన్నా కూడా భారీ యాక్షన్ ప్లాన్ తో సిద్ధం కావాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News