టీడీపీ వర్సెస్ వైసీపీ : దుష్ట శక్తులు...చెడు పీడలు

ఏ పండుగ వచ్చినా దానితో ముండిపెట్టి అంతర్లీనంగా ఉండే విషయాన్ని తమ రాజకీయానికి దట్టించి గ్రీట్ చేస్తున్నారా అన్న చర్చ వస్తోంది.

Update: 2024-10-12 15:30 GMT

రాజకీయాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఆఖరుకు పండుగలను సైతం వదలడం లేదు. ఏ పండుగ వచ్చినా దానితో ముండిపెట్టి అంతర్లీనంగా ఉండే విషయాన్ని తమ రాజకీయానికి దట్టించి గ్రీట్ చేస్తున్నారా అన్న చర్చ వస్తోంది.

హిందువులలో ప్రతీ పండుగకు ఒక విశేషం ఉంది. ఒక సందేశం ఉంది. పురాణ గాధలతోనే పండుగలు కూడా ముడిపడి ఉంటాయి. దానవ సంహారం తోనే పండుగ వస్తుంది. చెడుగుని మంచి జయించిన మీదటనే వేడుక చేసుకుంటారు

దాంతో ఆయా పండుగల సందర్భంగా జనాలకు ఇచ్చే సందేశంలో రాజకీయ పార్టీలు తాము మంచిగా ఉంటున్నామని చెడు మీద పోరాడుతున్నామని చెబుతూ వస్తున్నారు. గతంలో టీడీపీ ప్రతీ పండుగ విశిష్టతను బాగా ఉపయోగించుకుంది. ఆఖరుకు భోగీ మంటలలో కూడా ఆనాటి ప్రభుత్వ జీవో కాపీలను దహనం చేసి దానిని కూడా తమ ప్రచారానికి వాడుకుంది.

ఇపుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. అధికారంలోకి టీడీపీ కూటమి వచ్చింది అయినా పండుగల వేళ కూడా రాజకీయ ప్రకటనల వేడి ఆగడం లేదు టీడీపీ నేతల సందేశాలలో అరాచక శక్తులు అణచి మంచి రోజులు తెచ్చామని చెబుతూ ఉంటే వైసీపీ నేతల సందేశాలు మాత్రం చెడు ఎల్లకాలం ఉండదని మంచి మళ్లీ వస్తుందని చెబుతూ విజయదశమి గ్రీటింగ్ వస్తున్నాయి.

మంత్రి నారా లోకేష్ అయితే ప్రజలను హింసించిన జగనాసుర పలనను ప్రజలే అంతమొందించారని అన్నారు. వైసీపీ చెడు మీద కూటమి మంచి గెలిచిందని విజయదశమి సందేశాన్ని ఆ విధంగా పోల్చారు. టీడీపీ మంత్రి ఫరూఖ్ అయితే సైకో పాలనను అంతమొందించి చెడు మీద మంచి సాధించిన విజయం అని దసరా శుభాకాంక్షలు ప్రజలకు తెలియచేశారు.

ఇతర టీడీపీ నేతలు కూడా చెడు మీద మంచి విజయం అని వైసీపీని డైరెక్ట్ గానూ ఇండైరెక్ట్ గానూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తన సందేశంలో అంతిమ విజయం మంచిదే వరిస్తుంది అని అన్నారు. లోకకంఠకుడు అయిన మహిషాసురుడిని జగన్మాత వధించిందని దుష్ట శక్తులపై దైవ శక్తుల గెలుపునకు ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా అని తన పండుగ సందేశం వినిపించారు. ఆ మీదట చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైన మంచితనాన్నే అంతిమ విజయం వరిస్తుందని తనదైన కంక్లూషన్ ఇచ్చేశారు

ఇలా పండుగ వేళ చెడు మంచి మధ్య పోరు అని చెబుతూ నేతలు సందేశం ఇస్తున్నారు అలాగే దుష్ట శక్తుల మీద మంచి శక్తులదే ఎపుడూ గెలుపు అని కూడా అంటున్నారు ఏది మంచి ఏది చెడు అన్నది ఎవరికి వారి ఆలోచనలలో భావాలలో ఉండొచ్చు. కానీ లోకంలో ఎపుడూ చెడు మీద మంచి గెలుస్తూనే ఉంది. అది యుగయుగాలుగా ఉంది. అలాగని అంతా చెడే అని ఎక్కడా లేదు, ప్రతీ చోటా మంచి చెడులూ రెండూ ఉన్నాయి.

చెడు శాతం ఎక్కువైనపుడే మంచి దాని మీద పోరాటం చేసి గెలుస్తూ ఉంటుంది. ఇదే విజయదశమి సందేశం. అంతే కాదు ఇదే ప్రతీ పండుగ సందేశం. అందువల్ల మంచి పాళ్ళు ఎక్కువగా పెంచుకోవాలి. అది వ్యక్తులు అయినా వ్యవస్థలు అయినా సంస్థలు అయినా. చెడు ఎక్కువ అయింది అంటే దానిని తగ్గించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఎపుడూ మంచే గెలుస్తుంది. కాస్తా ఆలస్యం అయినా న్యాయం ధర్మమే గెలుస్తాయి. ఇదే పురాణాలు అయినా చరిత్ర అయినా చెప్పిన సారాంశం.

Tags:    

Similar News