రాజ్యాంగం ఎఫెక్ట్‌... ఏపీ అసెంబ్లీలో ఇలా జ‌రిగితే.. జ‌గ‌న్ స‌భ్య‌త్వం ర‌ద్దే!

ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం.. వైసీపీ అదినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌భ‌ల‌కు గైర్హాజ‌రు అవుతుండ‌డ‌మే.

Update: 2024-11-17 04:16 GMT

ప్ర‌స్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం.. వైసీపీ అదినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌భ‌ల‌కు గైర్హాజ‌రు అవుతుండ‌డ‌మే. ఇప్ప‌టికి రెండు సార్లు స‌భ‌లు జ‌రిగాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ది మూడో స‌భ‌.. పైగా బ‌డ్జెట్ స‌మావేశాలు. తొలి స‌భ‌కు వ‌చ్చిన జ‌గ‌న్ ఆయ‌న 10 మంది ఎమ్మెల్యేలు.. ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌క్కా వెళ్లిపోయారు. రెండోసారి జూలైలో జ‌రిగిన స‌భ‌ల‌కు.. వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి అడ్డుత‌గిలి ర‌గ‌డ చేసి.. ర‌చ్చ సృష్టించి వెళ్లిపోయారు. ఇక‌, ఇప్పుడు మూడోసారి స‌భ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ స‌భ‌ల‌కు అస‌లు హాజ‌రే కావ‌డం లేదు. పైగా రాబోమ‌ని చెప్పేశారు.

దీంతో జ‌గ‌న్ చుట్టూ విమ‌ర్శ‌లు.. వివాదాలు జ‌రుగుతున్నాయి. ఆయ‌న రాజీనామా చేయాల‌ని.. స‌భ‌ల‌కు వెళ్ల‌న‌ప్పుడు ప‌ద‌వులు ఎందుక‌ని ఆయ‌న సోద‌రి ష‌ర్మిల కూడా నిప్పులు చెరుగుతున్నారు. ఇక‌, రాజ‌కీయ ప‌క్షాలు.. అనుకూల మీడియా సైతం.. జ‌గ‌న్‌ను త‌ప్పుబ‌డుతూనే ఉన్నాయి. అయినా.. జ‌గ‌న్‌లో ఎక్క‌డా మార్పు రావ‌డం లేదు. మ‌రోవైపు.. రోజూ అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌స్తావ‌న వ‌స్తూనే ఉంది. జ‌గ‌న్ స‌భ‌కు రావాల‌ని కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సూచిస్తున్నారు. ఇవ‌న్నీ జ‌గ‌న్‌కు తెలిసి కూడా ఆయ‌న మౌనంగా ఉన్నారు. మీడియా స‌మావేశాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు.

అయితే..ఇప్పుడు ఒక సంచ‌ల‌న వ్య‌వ‌హారం తెర‌మీదికి తెర‌మీదికి వ‌చ్చింది. మాజీ ఐపీఎస్ ఉమేష్‌చంద్ర పీవీజీ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇది .. అసెంబ్లీవ్య‌వ‌హారాల‌కు సంబంధించిన భార‌త రాజ్యాంగం ప్ర‌స్తావించిన కీల‌క విష‌యం. రాజ్యాంగంలో అసెంబ్లీ, పార్ల‌మెంటు అంశాల‌కు సంబంధించి.. అనేక ఆర్టిక‌ల్స్ ఉన్నాయి. అవి స‌భ్యులు.. పార్టీలు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌న్న విష‌యాల‌ను సూత్రీక‌రించాయి. అదేవిధంగా చెప్పిన‌ట్టు చేయ‌క‌పోతే.. ఏం చేయాలో కూడా దిశానిర్దేశం చేశాయి. దీనిని బ‌ట్టి.. స‌భ‌ల‌కు రాని స‌భ్యులు త‌మ స‌భ్య‌త్వాన్ని ఆటోమేటిక్‌గా కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇదే విష‌యాన్ని ఉమేష్ చంద్ర స్ప‌ష్టం చేశారు.

ఆర్టిక‌ల్ 190

రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 190 స‌భ్యులు, స‌భ‌లకు రావాల్సిన విధానాల‌ను స్ప‌ష్టం చేసింది. దీనిలో మొత్తం 4 క్లాజులు ఉన్నాయి. వీటిలోనూ ప్ర‌ధానంగా 3(ఏ), 3(బీ) అత్యంత కీల‌కంగా ఉన్నాయి. వ‌రుస‌గా ఎవ‌రైనా స‌భ్యుడు క‌నుక 60 రోజుల పాటు స‌భ‌ల‌కు హాజ‌రు కాక‌పోతే.. స‌ద‌రు స‌భ్యుడి స‌భ్య‌త్వం(ఎమ్మెల్యే) ఆటోమేటిక్‌గా ఖాళీ అవుతుంద‌ని(ర‌ద్దు) ఈ ఆర్టిక‌ల్ కుండ‌బ‌ద్ద‌లు కొడుతోంది. ఇదే విష‌యాన్ని ఉమేష్ చంద్ర ప్ర‌స్తావిస్తూ.. జ‌గ‌న్ పేరును ఉటంకించారు. జ‌గ‌న్ క‌నుక 60 రోజుల పాటు స‌భ‌ల‌కు వెళ్ల‌క‌పోతే ఆయ‌న స‌భ్య‌త్వం ర‌ద్ద‌వుతుంద‌న్న‌ది(ఆయ‌నేకాదు.. ఎవ‌రైనా స‌రే) ఈ ఆర్టిక‌ల్ సారాంశంగా పేర్కొన్నారు.

ఇలా జ‌రిగిన‌ప్పుడే!!

మ‌న రాజ్యాంగం చిత్ర‌మైంది. ఇదే 190 ఆర్టిక‌ల్ 4వ క్లాజులో మ‌రో ప్ర‌స్తావ‌న కూడా ఉంది. ఏదైనా స‌భ వ‌రుస‌గా 60 రోజుల పాటు నిర్విరామంగా జ‌రిగిన‌ప్పుడు మాత్ర‌మే.. స‌భ‌కు హాజ‌రు కాని స‌భ్యుల స‌భ్య‌త్వం ర‌ద్ద‌వుతుంద‌ని పేర్కొన్నారు. అంటే.. అసెంబ్లీ వ‌రుస‌గా 60 రోజులు కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవాలి. అంతేకాదు.. ఈ 60 రోజుల వ్య‌వ‌ధిలో వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వు ఇచ్చినా.. మ‌ధ్య‌లోనే ప్రోరోగ్ చేసినా.. ఆర్టిక‌ల్ 190లోని 3 క్లాజ్ స‌భ్యుల‌కు వర్తించ‌దు. కాబ‌ట్టి.. ఉమేష్ చంద్ర చెప్పింది.. రాజ్యాంగంలో ఉన్న‌ది క‌రెక్టే అయినా.. అదే రాజ్యాంగంలో ఉన్న క్లాజ్ 4 ఆఫ్ 190 అమ‌లైన‌ప్పుడు మాత్ర‌మే జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వం ర‌ద్ద‌వుతుంది. లేక‌పోతే..అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఆడుకున్నా ర‌క్ష‌ణ ఉన్న‌ట్టే!!

Tags:    

Similar News