కీలక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఫిక్స్.. అయితే ఆయన కాదు!
తనకు బదులుగా తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి సీటు ఇవ్వాలని సీఎంకు విన్నవించారు. ప్రస్తుతం భూమన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ కదులుతోంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. ఈ దిశగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులకు టికెట్లు కావాలని అడిగే నేతలు ఎక్కువగానే ఉన్నారంటున్నారు. వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ((టీటీడీ) చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు సీఎం వైఎస్ జగన్ ను కలిసిన భూమన ఈసారి తాను పోటీ చేయనని.. తనకు బదులుగా తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి సీటు ఇవ్వాలని సీఎంకు విన్నవించారు. ప్రస్తుతం భూమన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు.
తిరుపతి మేయర్ స్థానం బీసీకి రిజర్వు అయింది.. ఓసీకి రిజర్వు అయితే భూమన తనయుడే మేయర్ అయ్యేవారు. మేయర్ గా బీసీ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ శిరీష ఉన్నారు. అయినప్పటికీ అనధికార మేయర్ గా అభినయ్ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహిత కుటుంబం కావడంతో అధికారులు సైతం భూమన అభినయ్ చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నారని టాక్.
ఓవైపు అనధికార మేయర్ గా, మరోవైపు తిరుపతికి తన తండ్రి స్థానంలో అనధికారక ఎమ్మెల్యేగా అభినయ్ రెడ్డి ద్విపాత్రాభినయం పోషిస్తున్నారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు కంటే అభినయ్ కే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సీఎం వైఎస్ జగన్ పక్కనే ఆయన ఆశీనులు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భూమన అభినయ్ తిరుపతి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని చెబుతున్నారు.
2009లో భూమన కరుణాకర్ రెడ్డి మొదటిసారి తిరుపతి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చేతిలో చిత్తయ్యారు. ఆ తర్వాత చిరంజీవి రాజ్యసభకు ఎంపిక కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమన వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014లోనూ వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. మళ్లీ 2019లో అతి తక్కువ మెజారిటీతో భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడికి సీటు ఇవ్వాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరడంతో సీఎం వైఎస్ జగన్ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన సేవలను పార్టీకి వాడుకుని ఆయన కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ కు తిరుపతి సీటును కేటాయించారు.
ఈ మేరకు తాజాగా వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాయలసీమ జిల్లాల నేతల నిర్వహించిన పార్టీ సమావేశంలో అభినయ్ రెడ్డి తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మరో యువ నేత రాజకీయ అరంగేట్రం చేయనున్నారు.