ఏపీ ఎన్నికల్లో 'హైదరాబాద్' ప్రచార వస్తువా?
పార్టీ కూడా వైవీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది. ఇక, టీడీపీ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి
ఏపీ ఎన్నికల్లో గతానికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రధాన వస్తువు అయితే.. ఈ సారి కీలక పార్టీ దృష్టి హైదరాబాద్ పై పడింది. ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా హైదరాబాద్‌ను మరో రెండేళ్లపాటు రాజధానిగా ఉంచాలనే డిమాండ్ను వినిపిస్తున్న విషయం తెరమీదికి వచ్చింది. దీనిని తొలుత పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి లేవనెత్తారు. అయితే.. దీనిపై విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు.
పార్టీ కూడా వైవీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పేర్కొంది. ఇక, టీడీపీ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించి..ఇ ప్పుడు హైదరాబాద్‌ను కావాలని కోరుతున్నారంటూ.. విమర్శలు గుప్పించింది. సరే.. ఈ వివాదం సమసిపోతోందని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంలో ఈ కేసు హైకోర్టుకు చేరింది. హైదరాబాద్‌ను మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా పేర్కొంటూ చట్టం తెచ్చేలా కేంద్ర హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
దీనిని ‘ప్రజాసంక్షేమ సేవాసంఘం’ కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ దాఖలు చేశారు. ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్‌ను ప్రకటించిన పదేళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగుస్తున్నా.. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్‌లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని ఆయన కోరుతున్నారు.
విభజన చట్ట నిబంధనలు అమలుకానందున హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరే హక్కు ఉంటుందని కూడా తన పిటిషన్‌లో అనిల్‌కుమార్ తెలిపారు. ఇక, ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదిలావుంటే.. అనిల్ కుమార్ వైసీపీకి సానుభూతి పరుడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు.. ఈ విషయంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా వైసీపీ వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశాన్ని దారిమళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నంగా అవి చెబుతుండడం గమనార్హం. మరి ఎన్నికల నాటికి ఈ విషయం ఎన్నిమలుపులు తిరుగుతుందో చూడాలి.