రాయచోటి గిద్దలూరు, మడకశిర మీద అనుమానం ఏంటి ?

ఈసారి మాత్రం అంతా రివర్స్ అయింది. రాయలసీమలోనే జగన్ కి భారీ ఓటమి లభించింది

Update: 2024-06-09 02:30 GMT

రాయలసీమలో జగన్ కి పట్టు ఉంది. వైసీపీ కి కంచుకోట లాంటి సీట్లు అనేకం ఉన్నాయి. అలాగే గ్రేటర్ రాయలసీమలో 74 సీట్లు ఉంటే అందులో ఎపుడూ మెజారిటీ సీట్లు వైసీపీ కైవశం చేసుకోవడం గడచిన రెండు ఎన్నికల్లో వస్తోంది.

ఈసారి మాత్రం అంతా రివర్స్ అయింది. రాయలసీమలోనే జగన్ కి భారీ ఓటమి లభించింది. ప్రత్యేకించి కడప జిల్లాలో పదికి ఆరు సీట్లు టీడీపీ గెలుచుకోవడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించింది. ఇదిలా ఉంటే ఇంతలా టీడీపీ సునామీ క్రియేట్ చేసినా కొన్ని సీట్లలో అతి తక్కువ మెజారిటీతోనే ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి చవి చూశారు. ఆ సీట్లలో రాయచోటి, గిద్దలూరు, మడకశిర వంటివి ఉన్నాయి.

ఈ సీట్లలో ఇపుడు వైసీపీ ఓటమి మీద పెద్ద ఎత్తున ప్రజలలోనే చర్చ సాగుతోంది. గెలుపు గుర్రాలు కావాల్సిన వైసీపీ నేతలు ఎందుకు ఓటమి పాలు అయ్యారు అన్న దాని మీదనే జనంలోనూ అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు.

ఆయా సీట్లలో తక్కువ తేడాతో ఓటమి పాలు అయినా ఎందుకు వైసీపీ అభ్యర్ధులు రీ కౌంటింగ్ అడగలేదు అని కూడా జనంలో నుంచే వస్తున్న ప్రశ్నగా ఉంది అంటున్నారు. టీడీపీ హై కమాండ్ నుంచి ఫోన్లు వస్తేనే ఆయా నియోజకవర్గాల్లో రిజల్ట్ మారింది అని అంటున్నారుట. దీని మీదనే ఆయా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

అయితే నిజంగా రిజల్ట్ అలా మారిందా లేక టీడీపీ మీద బురద జల్లేందుకు అలా అంటున్నారా అన్నది మాత్రం ఇంకా తెలియడంలేదు. మరి తక్కువ ఓట్లతో ఓటమి అని వైసీపీ వారికి తెలిసినా ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు.

ఏది ఏమైనా టీడీపీ సునామీ అన్నది వచ్చింది. ఒక కులం ఒక వర్గం ఒక ప్రాంతం అని కాదు అంతా కలసి మూకుమ్మడిగా టీడీపీకి మద్దతుగా నిలిచారు. దానికి సాక్ష్యమే భారీ మెజారిటీలు అత్యధికంగా నమోదు అయ్యాయి. అయితే కొన్ని చోట్ల వైసీపీ కొంత స్ట్రాంగ్ గా ఉండడంతో మెజారిటీలు తక్కువ వచ్చి ఉండవచ్చు అన్నది కూడా విశ్లేషణగా ఉంది.

ఏది ఏమైనా వైసీపీకి తగిలిన భారీ షాక్ తో వారు ఎక్కడ ఏమి జరిగింది అన్నది తెలియక తేరుకోలేక ఉన్నారు. దాంతో వారు పూర్తిగా డిఫెన్స్ లో పడడడంతోనే రీ కౌంటింగ్ లాంటివి అడగడం లేదు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా సాంతం వైసీపీకి ఓటమి పలుకరించిన తరువాత ఒకటి రెండు చోట్ల ఏదో జరిగిందని యాగీ చేసుకోవడం కూడా సబబు కాదనే అంటున్నారు. అయితే నిజంగా ఈ అనుమానాలల్లో పస ఉంటే మాత్రం అడగడంలోనూ తప్పు లేదన్న వారూ ఉన్నారు. చూడాలి మరి వైసీపీ ఏ విధంగా ఆలోచిస్తుందో.

Tags:    

Similar News