గట్టు మీద దుట్టా...వైసీపీ టీడీపీ ఆశలు...!
ఈ నేపధ్యంలో యార్లగడ్డను తమ వైపునకు లాగేసిన టీడీపీ ఇపుడు దుట్టా మీద కన్నేసింది.
ఈ మధ్య దాకా మీడియాలో కూడా పెద్దగా కనిపించని వినిపించని ఆయన పేరు ఇపుడు మారుమోగిపోతోంది. గన్నవరంలో ఆయన ఇపుడు కింగ్ మేకర్ అయ్యేలా ఉన్నారు. ఆయనే సీనియర్ వైసీపీ నేత దుట్టా రామంచంద్రరావు. ఆయన ఎపుడో తొమ్మిదేళ్ల క్రితం 2014లో వైసీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసి దాదాపుగా పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2019 నాటికి జగన్ ప్రభంజనం ఉన్నా కూడా దుట్టాకు టికెట్ దక్కలేదు
వైసీపీలో మరో నేత యార్లగడ్డ వెంకటరావుకు టికెట్ ఇచ్చారు. అయినా సరే ఆయన మౌనమే అన్నట్లుగా ఉన్నారు. ఇక 2024 ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ గన్నవరం పాలిటిక్స్ గరం గరం గా మారుతోంది. దుట్టా ఇంటికి స్వయంగా వెళ్ళి అన్నీ మాట్లాడుకుని వచ్చాక యార్లగడ్డ టీడీపీలోకి జంప్ అయ్యారు.
ఇక దుట్టా యార్లగడ్డ వైసీపీలో ఉన్నపుడు వల్లభనేని వంశీకి యాంటీగా కూటమి కట్టారు. అలా ఇద్దరూ నేస్తాలు అయ్యారు. ఇపుడు యార్లగడ్డ పార్టీ విడిచి వెళ్లారు. దాంతో వైసీపీని సవాల్ చేసే స్థితిలోకి గన్నవరం వచ్చేసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ బలమైన వార్డుని కోల్పోయింది. యార్లగడ్డ వంశీని ఓడిస్తాను అని పట్టుదల మీద ఉన్నారు.
దీంతో ఇపుడు వంశీ గెలుపు ఆయనతో పాటు వైసీపీకి ప్రతిష్టాత్మకం అవుతోంది. దుట్టా తనకే మద్దతు అంటూ యార్లగడ్డ చెబుతున్నారని టాక్. అదే టైంలో సమయం వచ్చినపుడు తన నిర్ణయం ప్రకటిస్తాను అని దుట్టా అంటున్నారుట. దీంతో వైసీపీలో కలవరం రేగుతోంది అని అంటున్నారు.
ఈ పరిణామాల నేపధ్యంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి దుట్టా ఇంటికి స్వయంగా వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుట్టా మదిలో ఏముంది, ఆయన గురించి వాకబు చేయడంతో పాటు వైసీపీలో ఉంటూ పార్టీలో చురుకుగా వ్యవహరించేలా చూడాలని బాలశౌరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.
ఇది అధినాయకత్వం తరఫున వెళ్ళినట్లుగానే చూస్తున్నారు. అయితే దుట్టా మాత్రం మీడియాతో మాట్లాడుతూ మూడు నెలల క్రితం సీఎం జగన్ని కలసి వచ్చానని, తన మనసులో ఏముందో అక్కడే చెప్పానని అంటున్నారు. మరి బాలశౌరి మర్యాదపూర్వక భేటీ అంటున్నా దుట్టాను తమ వైపు తిప్పుకోవడానికే అని ప్రచారం సాగుతోంది. ఇంకో వైపు చూస్తే దుట్టా వర్గం కనుక ప్లస్ అయితే వైసీపీకి గన్నవరంలో ఎడ్జి ఉంటుందని అంటున్నారు.
అలా కాకుండా దుట్టా కూడా టీడీపీ వైపు వెళ్తే మాత్రం వంశీకి కష్టమే అని అంటున్నారు. ఈ నేపధ్యంలో యార్లగడ్డను తమ వైపునకు లాగేసిన టీడీపీ ఇపుడు దుట్టా మీద కన్నేసింది. అయితే దుట్టా ఇపుడు కీలకంగా మారిపోయారు. గన్నవరంలో ఎవరు గెలవాలన్నా ఆయన తులాభారం గా మారారు. ఆయన మొగ్గు ఏ వైపు ఉంటే వారిదే విజయం అంటున్నారు. ఇలా దుట్టాకు అటు వైసీపీ ఇటు టీడీపీలలో కూడా విపరీతమైన ప్రాధాన్యత పెరిగిపోయింది. చూడాలి మరి దుట్టా గట్టు మీద నుంచి ఏ వైపునకు వస్తారో.