వైసీపీ అండర్ పాస్ కరెంట్.. అప్పుడు కూడా ఇదే గోల...!
ఇక, సీమలోని ఓ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి 2019లో సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్వయంగా డాక్టర్ కూడా.
''వైసీపీ మునిగిపోయే నావ.. వైసీపీలో ముసలం పుట్టింది.. ఇక పార్టీలో రెబల్స్ పెరుగుతున్నారు. వారిని కట్టడి చేయడం అంత ఈజీకాదు.. ప్రస్తుతం జరుగుతున్న మార్పులు వైసీపీకి మరణ శాసనమే. అధికారం పోతుంది. జగన్ అంతా స్వయం కృతంగా చేసుకుంటున్నారు..''ఇదీ.. గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలు.. వ్యాఖ్యలు. అయితే.. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని కొంత లోతుగా గమనిస్తే.. వైసీపీకి ఇవేవీ కొత్తకాదు.
సీఎం జగన్ వ్యవహారం తీసుకుంటే.. ఆయన అనేక ఢక్కా ముక్కీలు తిన్నారు. కాపుల రిజర్వేషన్ అంశం సలసల మరుగుతున్న సమయంలో.. కాపులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలే ని సమయంలో సీఎం జగన్ వారికి (కాపులు) బలమైన నియోజకవర్గం జగ్గంపేట నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి..రిజర్వేషన్ ఇవ్వలేనని తెగేసి చెప్పేశారు. ఇది అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఇంకే ముంది..కాపులు గుండుగుత్తగా జగన్‌ను చెత్తబుట్టలో వేసేస్తారని విశ్లేషణలు వచ్చాయి.
ఇక, సీమలోని ఓ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి 2019లో సీఎం జగన్ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్వయంగా డాక్టర్ కూడా. ఇది ఖచ్చితంగా నామినేషన్ల ఘట్టం జరుగుతున్నప్పుడే.. జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సదరు డాక్టర్, ఆయన సతీమణి కూడా.. విషపు ఇంజక్షన్లు ఎక్కించుకుని.. నానా రగడ సృష్టించారు. పెద్ద ఎత్తున లేఖ కూడా రాశారు. తమకు ఏదైనా జరిగితే.. దానికి జగన్ ఆయన పార్టీనే కారణమని కూడా లేఖ రాసి పెట్టారు. చివరకు అంబులెన్స్‌లోనే అప్పట్లో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.
ఇంత జరిగినా.. సదరు డాక్టర్ గ్రాఫ్ బాగోలేదని.. సీఎం జగన్ పట్టించుకోలేదు. అయితే.. ఆత్మహత్యకు ప్రయత్నించారన్న సానుభూతితో ఆయనతో చర్చకు అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించారు. అంటే.. ఈ పరిణామాలను గమనిస్తే.. ఏదో జరిగిపోతుంది.. పార్టీనాశనం అయిపోతుంది.. ఇక, తమకు పుట్టగతులు ఉండవు.. అనే భయం కానీ.. అబ్యర్థులను బుజ్జగించే వ్యూహాలు కానీ.. వైసీపీలో ఎక్కడా లేవు. వాస్తవానికి ఇప్పటి కంటే కూడా.. 2019లోనే జగన్‌పై తీవ్రమైన వ్యతిరేక వార్తలు , ప్రసారాలు వచ్చాయి.
అయినప్పటికీ.. లెక్కచేయకుండా.. ప్రజానాడిని పట్టుకునే జగన్ ముందుకు అడుగులు వేశారు. అప్పట్లో ఆయన చేసిన ప్రయోగం ఫలించబట్టే.. 150 మంది(తాను కాకుండా) ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకున్నారు. సో.. ప్రస్తుతం కూడా ఇదే జరుగుతుందని.. పైకి జరుగుతున్న విషయాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు.