యూపీ సీఎం ప్రజెంటేషన్ ...హైదరాబాద్ కి వలస ఎందుకు వస్తున్నారు ?

వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్ ని తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కోరారు.

Update: 2024-07-28 13:00 GMT

వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఉత్తరప్రదేశ్ ని తీర్చిదిద్దాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కోరారు. ఆయన ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి విన్నపం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన రెండు పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రామ సచివాలయాలను డిజిటలైజేషన్ చేయడం అలాగే ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సంబంధించిన పథకాలను యోగి వివరించారు.

ఇది బాగానే ఉంది కానీ యూపీకి అంత ఆర్ధిక వ్యవస్థ ఆ సామర్థ్యం ఉంటే కనుక ఎక్కడో ఉత్తర భారతం నుంచి అందునా ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణాదిన ఉన్న హైదరాబాద్ కి పొట్ట చేత బట్టుకుని లక్షలాదిగా ఎందుకు వలసలు వస్తున్నారు అన్నది కీలకమైన మౌలికమైన ప్రశ్నగా ఉంది.

ఇది నిజంగా ఆ రాష్ట్రానికి ఇబ్బందికరమైనదే అని అంటున్నారు. సొంత రాష్ట్రంలో ఉపాధి లేకనే ఈ విధంగా ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు అన్నది కదా అసలు విషయం. ఈ విషయం తెలుసుకోకుండా యూపీని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా చేసినా ఉపయోగం ఏమిటి అన్నది చర్చనీయాంశంగా ఉంది.

మరి దీని మీద గత ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఏమంటుంది అన్న ప్రశ్నలూ ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కానీ ఇతర ముఖ్య నేతలు కానీ ఏ రకంగా స్పందిస్తున్నారు అన్నది చూస్తే వలసలను అరికట్టడం అన్న దాని మీద దృష్టి ఎంత మేరకు సారించారు చూడాల్సి ఉంది అని అంటున్నారు.

ఉత్తరప్రదేశ్ లో రెండు సార్లు బీజేపీ గెలిచి అధికారంలో ఉంది. గడచిన కాలంలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది అన్న వివరాల జోలికి పోనవసరం లేకుండానే కొన్ని విషయాలు చూస్తే యూపీ వెనకబాటుతనం అక్కడ ఆర్ధిక పరిస్థితులు అర్ధం అవుతాయని అంటున్నారు. కేవలం రోజుకు రెండు మూడు వందల దినసరి కూలీ కోసం పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ కి రావడం పట్ల కూడా యూపీ పాలకులు స్పందించారు అని అంటున్నారు.

వారంతా ఎందుకు పనికి వస్తున్నారు అన్నది కూడా చూడాలని అన్నారు. సొంత రాష్ట్రంలో వారికి ఉపాధి దొరికేలా చేస్తే యూపీ ఆర్థికంగా మంచి ప్రగతిని సాధించినట్లే అంటున్నారు. ముందు మౌలికమైన అంశాలను చూడాల్సి ఉందని ఆ మీదట వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా యూపీని తీర్చిదిద్దినా అభ్యంతరాలు ఉండవని అంటున్నారు.

దేశ జనాభాలో 15వ శాతం పైగా ఉన్న యూపీలో ఆర్ధిక పరిస్థితులు చూస్తే కనుక వెనకబడి ఉందని గణాంకాలు చెబుతూంటాయి. ఎంతో మంది యువత ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటారు. అలాగే ఉపాధి కోసం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు కూడా యూపీ నుంచి ఎక్కువగానే ఉన్నాయి.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు నేల విడిచి సాము చేయకుండా ముందు వలసలను ఎలా అరికట్టాలి అన్న దాని మీద సీరియస్ గానే బీజేపీ పాలకులు ఆలోచన చేయాలని కోరుతున్నారు. కేంద్రంలోనూ యూపీలోనూ ఏడేళ్ళుగా బీజేపీ పాలన ఉన్నా ఇంకా వలసలు అలాగే ఉన్నాయని ఈ క్రమంలో కొత్త పథకాలు వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వంటి పెద్ద మాటలు 2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అన్నది విపక్షాల విమర్శలుగా ఉన్నాయి. దీంతో సమస్యలను అడ్రస్ చేసే దృక్కోణంలో మార్పు రావాలని అంటున్నారు.

Tags:    

Similar News