మౌనంగానే ఎదగమని.. పాగా వేస్తున్న యువ ఎమ్మెల్యేలు.. !
రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా నియోజకవర్గాల్లో యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా నియోజకవర్గాల్లో యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. పైగాకొత్తగా ప్రజల నుంచి ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం ద క్కించుకున్నారు. సహజంగా తొలిసారి ఎన్నికైన వారిలో దూకుడు ఉంటుంది. లేదా మౌనంగా ఉంటారు. ఎప్పటికప్పుడు యువ ఎమ్మెల్యేలు విజయం సాధించడం కొత్త కాదు. అయితే.. వారు ప్రజలతో మార్కులు వేయించుకుంటున్నారా? లేదా? అనేది కీలకం.
తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రస్తుతం ఉన్న యువ ఎమ్మెల్యేలకు.. గతంలో గెలిచిన వారికి చాలా తేడా కనిపిస్తోంది. కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన వారు కూడా.. ఇప్పుడు తమ వారసత్వం పక్కన పెట్టి.. తమదైన పంథాలో ముందుకు సాగుతున్నారు. తమకంటూ వేదికలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, శింగనమల ఎమ్మెల్యే సహా తుని వరకు.. అనేక మంది ప్రత్యేకంగా నిలుస్తున్నారు.
ఎక్కడా ప్రచారం కోరుకోకుండా.. పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న గల్లా మాధవి, పెదకూరపాడు నుంచి విజయం దక్కించుకున్న యువ నేత భాష్యం వరకు.. అదేవిధంగా నరసరావు పేట నుంచి గెలిచిన చదలవాడ అరవిందబాబు దాకా.. అందరూ తమ తమ ప్రయత్నాల్లో తీరిక లేకుండా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లో కి తీసుకువెళ్తున్నారు.
ఇదేసమయంలో వివాదాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఒకరిద్దరు తొలినాళ్లలో వివాదాలకు కారణ మైనా.. చంద్రబాబు సూచనలు, సలహాలు, హెచ్చరికలతో లైన్‌లోకి వచ్చేశారు. దీంతో ఆయా నియోజకవ ర్గాల్లో పరిస్థితులు చక్కబడ్డాయనే చెప్పాలి. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ తమ ముద్ర వేసేందుకు కూడా యువ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. తమకంటూ సొంతగా రాజకీయాలు చేస్తూ.. ప్రత్యేక పంథాలో దూసుకుపోతున్నారు. దీంతో యువ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పనితీరు బాగుందన్న ప్రశంసలు వస్తుండడం గమనార్హం.