జనవరి డెడ్ లైన్ పెట్టారా ?

అయితే ప్రతినిధుల సమావేశం తర్వాత ఇదే విషయమై ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు.

Update: 2023-12-22 07:16 GMT

మేనిఫెస్టో రూపకల్పనకు జనవరి నెలాఖరును జగన్మోహన్ రెడ్డి డెడ్ లైనుగా నిర్ణయించారు. గురువారం నాడు పార్టీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం అర్ధమవుతోంది. గురువారం ప్రతినిధుల సమావేశంలోనే రాబోయే ఎన్నికల్లో మ్యానిఫెస్టో జనాదరణ పొందేట్లుగా ఉండాలని ఆదేశించారు. ఏ ఏ అంశాలను మ్యానిఫెస్టోలో ఉంటాయనే విషయాన్ని కూడా జగన్ చూచాయగా చెప్పారు. అయితే ప్రతినిధుల సమావేశం తర్వాత ఇదే విషయమై ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీతో సమావేశమయ్యారు.

ఐ ప్యాక్ కమిటీతో పాటు మేనిఫెస్టో కమిటి ఛైర్మన్, ఎంఎల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు కమిటి సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. జనవరి నెలాఖరుకల్లా మేనిఫెస్టో రెడీ అయిపోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి మొదటివారం నుండి పార్టీ శ్రేణులంతా మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే స్లోగన్ను మ్యానిఫెస్టోతో కలిపి ప్రచారం చేయాలని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో ఏమిటి ? దాని అమలు చేసిన విధానాన్ని జనాలకు వివరించాలన్నారు.

మ్యానిఫెస్టోలో అంశాలను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అమలుచేయబోతున్నదనే విషయాన్ని కూడా ప్రజలందరికీ నేతలు, క్యాడర్ వివరంగా చెప్పానలని చెప్పారు. ఇందుకు నవరత్నాల అమలునే ఉదాహరణలుగా చూపించాలని స్పష్టంచేశారు. సామాజిక పెన్షన్లు, రైతు, కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు, పంటల బీమా, ఉచిత విద్యుత్, ఉపాధికల్పన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత లాంటి అనేక అంశాలను జనాలకు వివరించాలని జగన్ చెప్పారు.

అంటే పై అంశాలన్నీ రాబోయే మ్యానిఫెస్టోలో ఉండబోతున్న విషయాన్ని జగన్ చెప్పకనే చెప్పారు. కాకపోతే పాయింట్ టు పాయింట్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించలేదు. మ్యానిఫెస్టోలో ఎలాంటి అంశాలకు ప్రధాన్యత ఉండాలన్న విషయం ఐప్యాక్ ప్రతినిధులతో కలిసి మ్యానిఫెస్టో కమిటి రూపకల్పన చేస్తుంది. అందుకనే మ్యానిఫెస్టో తయారుచేసేందుకు కమిటికి జగన్ నెలరోజుల సమయమిచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కూడా టీడీపీ, జనసేన తరపున ఉమ్మడి మ్యానిఫెస్టోను రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని అంశాలను చంద్రబాబు, పవన్ వివరించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News