పార్టీ మార్పుపై స్పందించిన అవినాష్ రెడ్డి

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం నాలుగు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే

Update: 2024-06-25 15:43 GMT

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం నాలుగు లోక్ సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే, ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు బీజేపీలోకి జంప్ అవుతున్నారంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాము పార్టీ మారే ప్రసక్తే లేదని, బీజేపీలో చేరాల్సిన ఖర్మ తమకు పట్టలేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు.

పూటకో పార్టీ మార్చే ఆదినారాయణ రెడ్డికి ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయని, తమకు రావని కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ అధినేత జగన్ నాయకత్వంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పనిచేస్తారని, తామంతా జగన్ వెంటే ఉన్నామని అన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, అందుకే ఎల్లో మీడియా పార్టీ మారుతున్నారంటూ తమపై అలా తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. కడప ఎంపీగా మూడోసారి గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు.

ఎన్నికల ప్రచారం సమయంలో తనపై తప్పుడు ప్రచారం చేశారని, అయినా సరే, జగన్ ఆశీస్సులు, నేతలు, కార్యకర్తల కృషి, ప్రజల మద్దతుతో గెలిచానని అన్నారు. టీడీపీ గెలవగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని , 2019 ఎన్నికల్లో తాము గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నామని ...ఇలా ప్రత్యర్థి పార్టీలపై దాడులు చేయలేదని గుర్తు చేశారు. ఓ వైపు కార్యకర్తలను రెచ్చగొడుతూ మరోవైపు నీతి సూక్తులు చెబుతున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News