నెల్లూరు జైలుకు జగన్‌.. చంద్రబాబుపై నిప్పులు!

ఈ సందర్భంగా జగన్‌ ఆయనకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. తామంతా అండగా ఉంటామని.. భయపడవద్దని పిన్నెల్లికి జగన్‌ హామీ ఇచ్చారు.

Update: 2024-07-04 08:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో ఒక పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను పగులకొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అలాగే దీన్ని అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. అలాగే ఒక మహిళను చంపుతానని పిన్నెల్లి బెదిరించారనే అభియోగాలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్‌ అయ్యారు.

ఈ సందర్భంగా జగన్‌ ఆయనకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది. తామంతా అండగా ఉంటామని.. భయపడవద్దని పిన్నెల్లికి జగన్‌ హామీ ఇచ్చారు. పోలీసులు పెట్టిన తప్పుడు కేసులపై సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడదామని చెప్పినట్టు తెలిసింది.

కాగా నెల్లూరు సెంట్రల్‌ జైలు నుంచి జగన్‌ బయటకొచ్చాక సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాపాలు శిశుపాలుడి పాపాల్లా పండుతాయన్నారు.

టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని జగన్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

Read more!

కారంపూడి సీఐని పిన్నెల్లి కనీసం చూసిన దాఖలాలు లేవన్నారు. మే 14న ఘటన జరిగితే మే 23న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని తెలిపారు. నిజంగా సీఐపై దాడి జరిగి ఉంటే ఆ మరుసటి రోజు కేసు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.

చంద్రబాబు పాపాలకు లెక్క జమ చేసి ప్రజలు చంద్రబాబుకు గట్టిగా జవాబిచ్చే రోజులు తొందరలోనే ఉన్నాయని జగన్‌ తెలిపారు.

బడులు ప్రారంభమైనా అమ్మ ఒడి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు రావణకాష్టంగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవన్నారు.

ఇచ్చిన హామీలు పక్కనపెట్టి చంద్రబాబు విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. తమ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ఆస్తుల విధ్వంసం, దాడులతో ఏపీని రావణం కాష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలకు మంచి చేసినా తమ పార్టీ ఓడిపోయిందని, చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని జగన్‌ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.

ఎవరు తప్పు చేసినా తప్పు అని నాయకుడిగా చెప్పాల్సి ఉందన్నారు. అయితే దగ్గరుండి దాడులను ప్రోత్సహించడం అతి దుర్మార్గమన్నారు. దాడులను ఆపాలని తాము కోరడం లేదని.. హెచ్చరిస్తున్నానన్నారు. ఇదే మాదిరిగా దాడులు కొనసాగితే ఎవరూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రియాక్షన్‌ అనేది కచ్చితంగా ఉంటుందని చంద్రబాబుకు చెబుతున్నానన్నారు.

Tags:    

Similar News

eac