జగన్ ఎవరికీ అందడు...ఇలా డిసైడ్ కావాల్సిందేనా...?

అందుకే ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ కాస్తా సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతోంది. ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి

Update: 2023-10-11 08:48 GMT

జగన్ కి ఏమి తెలుసు రాజకీయం అన్న వారే ఇటీవల వైసీపీ ప్రజా ప్రతినిధుల సభలో రాజకీయం అంటే ఏమిటో గుక్క తిప్పుకోకుండా జగన్ చెబుతూ ఇచ్చిన నిర్వచనం చూసి ఔరా అనుకున్నారు. రాజకీయం అంటే పేదల కోసం ప్రజల కోసమే చేసేదిగా ఉండాలన్నది జగన్ ఫిలాసఫీ. ఆ విషయంలో ఆయన తన ఫుల్ ఫోకస్ ని పెడుతూనే ప్రత్యర్ధులను వేటాడే విషయంలో ఏ మాత్రం ఎక్కడా స్పేర్ చేయరు. ఆయనకు చాన్స్ దొరకాలే కానీ నో రాజీ నో మొహమాటం. అదే ఆయన తీరు.

అందుకే జగన్ నుంచి ట్రెడిషనల్ పాలిటిక్స్ ని ఆశించేవారికి ఎవరికీ ఆయన కనీసం ఊహకు కూడా అందడు. సంప్రదాయ రాజకీయాలల్లో ఒకరికి ఒకరు కాచుకోవడం ఉంటుంది. రాజకీయం అనే ఆటను ప్రజల వరకూ పార్టీల వరకూ పరిమితం చేసి అధినేతలు మాత్రం చక్కగానే ఉంటారు. దేశమంతా ఇలాగే జరుగుతోంది. కానీ జగన్ వ్యవహార శైలి వేరు. ఆయన తనకు కుదరదు అనుకుంటే ప్రత్యర్ధులను సైతం పక్కన పెట్టేస్తారు.

అందుకే ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ కాస్తా సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతోంది. ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. రాజకీయాల్లో పట్టు విడుపులు ఉండాలి. జగన్ కి అవి లేవు అని ఈ మధ్యనే వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. మరి ఆ పట్టు విడుపూ ఏమిటో ఏ సందర్భంలో ఆయన అన్నారో కానీ జగన్ ఒక పట్టు పట్టారంటే విడవరు అని ఎవరైనా చెబుతారు. బహుశా అదే మొత్తం విపక్షానికి అసలు ఏమీ బోధపడకుండా ఉంది.

లేకపోతే చంద్రబాబుని అరెస్ట్ చేయాలని చాలా మంది దిగ్గజ నేతలు చూశారు. హరిహరాదులు అడ్డు వచ్చినా బాబుని కటకటాల వెనక్కి పంపే విషయం ఖాయం అని తెలంగాణా సీఎం కేసీయార్ అన్నారు. నరేంద్ర మోడీ అయితే పోలవరం ఏటీఎం గా వాడుకుంటున్నారు అని ఘాటైన కామెంట్స్ చేశారు. ఇక చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో మోడీని గట్టిగా విమర్శించినా అరెస్ట్ దాకా కధ అయితే వెళ్లలేదు.

కానీ ఏపీలో అది కూడా జగన్ నాలుగేళ్ళ పాలన పూర్తి అయింది ఇక ఏమి అరెస్ట్ ఉంటుంది అని అనుకుంటున్న టైం లో బాబు జైలు పాలు అయ్యారు. ఏకంగా నెల రోజులకు పైగా ఆయన జైలు గోడల మధ్యన ఉంటున్నారు. దీని మీద అనేక మంది అనేక రకాలైన విశ్లేషణలు కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన ఎంపీ, ఒకనాడు చంద్రబాబు సన్నిహితుడు అయిన సుజనా చౌదరి అయితే ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్ ఎవరి ఊహలకు అందడని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

జగన్ కి అపారమైన తెలివితేటలు ఉన్నాయని అన్నారు. ఆయనను ఎవరూ తక్కువ అంచనా వేయకూడదని అన్నారు. జగన్ నిరంతరం పాలిటిక్స్ వ్యూహాలు ఎత్తుగడల గురించే ఆలోచిస్తారు అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసినపుడు జగన్ నిజంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారా అని అనిపించకమానదు.

జగన్ ఏమి చేసినా దాని వెనక ఆయన ఆలోచనలు కసరత్తు అన్నీ ఉంటాయి. అది చాలా మందికి తెలియదు. ఆయన తొందరపాటుగా చేసినట్లుగా ఉంటుంది. కానీ ఒక విషయం మీద ఫలితాలు పర్యవసానాలు అన్నీ ఆలోచించుకున్న మీదటనే జగన్ అడుగులు ముందుకు వేస్తారు అని అంటారు. అదే బాబు అరెస్ట్ లో మరోసారి నిరూపితం అయిందంటున్నారు.

Tags:    

Similar News