పెద్దల మీద ఒట్టు... జగన్ అవసరం ఆ పార్టీకి చాలా ఉంది...!

జగన్ తో బీజేపీ బంధం ఏమిటి అని చాలా మంది అడుగుతారు. కొందరు రెండు పార్టీల మధ్య తెర వెనక దోస్తీని అనేక రకాలుగా చెబుతారు

Update: 2024-02-09 23:30 GMT

జగన్ తో బీజేపీ బంధం ఏమిటి అని చాలా మంది అడుగుతారు. కొందరు రెండు పార్టీల మధ్య తెర వెనక దోస్తీని అనేక రకాలుగా చెబుతారు. అయితే జగన్ బలం అంతా పెద్దల సభలో ఉంది. రేపటి రోజున మూడవసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా పెద్దల సభలో పూర్తి మెజారిటీ దక్కించుకోవాలంటే మరో అయిదేళ్ల కాలం పడుతుంది. ఈ లోగా కీలక రాష్ట్రాలు జారిపోకుండా ఉంటేనే అది జరిగేది.

ఈ నేపధ్యంలో బీజేపీ ప్రవేశపెట్టే అనేక బిల్లులకు రాజ్యసభలో మద్దతు ఇచ్చే నమ్మకమైన పక్షంగా వైసీపీ ఉంది. వైసీపీకి ఈ రోజున రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అందులో రాజ్యసభ మెంబర్ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రిటైర్ అవుతున్నారు.

ఈ నెల చివరిలో జరిగే ఎన్నికల్లో వైసీపీ మూడు ఎంపీలను ఏపీ నుంచి గెలుచుకుంటే ఆ సంఖ్య కాస్తా పదకొండు అవుతుంది. ఏపీలో మరే రాజకేయ పక్షానికి చోటు లేకుండా మొత్తం సీట్లు వైసీపీకే దక్కుతాయన్నా మాట.

మరో వైపు చూస్తే దేశంలోనే మూడవ అతి పెద్ద పార్టీగా రాజ్యసభలో ఈ మార్చి తరువాత వైసీపీ ఉండబోతోంది. పదకొండు మంది ఎంపీలు అంటే మాటలా. అందుకే బీజేపీ వైసీపీని చేరదీస్తోంది అని అంటున్నారు.

ఇది ఒక పాయింట్ అయితే మరో పాయింట్. జగన్ విధేయత. ఆయన కాంగ్రెస్ ని కలలో కూడా కలవరు. అంటే అచ్చం బీజేపీ తీరులోనే అన్న మాట. జాతీయ స్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ పరమ శత్రువు. అలాగే దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా ఉండదు, ఒక్క వైసీపీ తప్ప.

దేశంలోని అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ తో జట్టు కట్టినవే. ఆఖరుకు ఏపీలో తెలుగుదేశం పార్టీతో సహా. ఈ విషయంలో ఉన్న రాజకీయ భావసారూప్యం బీజేపీని వైసీపీని అలా కట్టి ఉంచుతోంది. ఇక జగన్ లో నిలకడ అయిన విధానం ఉంది అన్నది బీజేపీ పెద్దలు గ్రహించారు.

అధికారం కోసం ఆయన అటు వైపు ఇటు వైపు మారే రాకం కాదని కూడా బీజేపీ పెద్దల లోతైన అవగాహనతో తెలుసుకున్నారు అని అంటున్నారు. అందుకే జగన్ వైపు బీజేపీ పెద్దలకు సాఫ్ట్ కార్నర్ ఉంది అని అంటున్నారు.

ఇంకో విషయం కూడా ఉంది. ఏపీలో వైసీపీ హవా తగ్గలేదని. జనవరి నెల మూడవ వారం నుంచి చివరి వారం వరకూ బీజేపీ ఏపీ విషయంలో సొంతంగా చేయించిన సర్వేలో వైసీపీకే మరోమారు అధికారం దక్కుతుంది అని వచ్చిందట. ఇక వైసీపీ ఎంపీలు కూడా కేంద్రంలో రేపటి రోజున బీజేపీకి మెజారిటీ సరిపోకపోతే సర్దుబాటు చేస్తారు అని నూరు శాతం నమ్మకం కమలం పెద్దలలో ఉంది. దాంతోనే ఫ్యాన్ పార్టీ మీద ఈ తెర వెనక బంధం అని అంటున్నారు.

ఇక టీడీపీ విషయంలో కూడా బీజేపీకి కొన్ని రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. పొత్తుకు వచ్చినా ఆ పార్టీని వీక్ చేసి తాము బలపడాలన్న ఆలోచనలు ఉన్నాయి. పొత్తు లేకపోతే డైరెక్ట్ గానే తమ ప్లాన్స్ ని అమలు చేస్తారు. ఇలా టీడీపీ విషయంలో ప్లాన్ ఏ బీని రెడీ చేసుకుంది బీజేపీ.

అందుకే పవన్ ని తమ వైపు ఉంచుకుని మరీ టీడీపీ తో పొత్తు కోసం బెట్టు చేస్తోంది అని అంటున్నారు. చూడబోతే ఏపీ పాలిటిక్స్ లో బీజేపీ పట్టు బిగించింది. జగన్ కి మరో టెర్మ్ అధికారం దక్కినా ఓకే అన్నట్లుగా కమలం పార్టీ పాలిటిక్స్ సాగుతోంది. టీడీపీకి చావో రేవో అయితే బీజేపీకి ఎందుకు పడుతుంది అన్నది ఇక్కడ ప్రశ్న.

తెలుగుదేశం పార్టీని తాము కోరి ఎందుకు లేపాలన్నది కూడా మరో ఆలోచన ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా జగన్ మీద కమలం రాజకీయ దూకుడు ఒక స్థాయిని మించి ముందుకు సాగదు అని అంటున్నారు. ఏపీలో ఈ తరహా రాజకీయంలో అటు బీజేపీ సేఫ్ గా గేం ఆడుతోంది.

ఇటు జగన్ సైతం రిలాక్స్ గానే ఉన్నారు. అయోమయం అంతా టీడీపీ జనసేన కూటమిలోనే ఉంది. పొత్తు పెట్టుకుంటే ఒక తంటా లేకపోతే మరో తంటా అన్నట్లుగా విపక్ష కూటమి సతమతమవుతోంది అని అంటున్నారు. అయితే జగన్ ని బీజేపీ నుంచి వేరు చేయడం అంటే కష్టం అన్న లాజిక్ ని ఈ రాజకీయ లెక్కలను ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ ఎలా మిస్ అవుతున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న.

Tags:    

Similar News