అందరూ విశాఖ మీద పడ్డారు...జగన్ ప్లాన్ చూసేనా...?
విశాఖ అంటేనే అద్భుతమైన నగరం. పర్యాటకులు విశాఖకు పెద్ద ఎత్తున వస్తారు. విశాఖ అందాలను చూసి పులకించిపోతారు.
విశాఖ అంటేనే అద్భుతమైన నగరం. పర్యాటకులు విశాఖకు పెద్ద ఎత్తున వస్తారు. విశాఖ అందాలను చూసి పులకించిపోతారు. ఏటా లక్షలలో విశాఖకు టూరిస్టులు వస్తారు. అయితే ఇపుడు విశాఖకు మరింత తాకిడి పెరిగిపోయింది. వచ్చే వారు రాజకీయ నాయకులు. విశాఖ మీద గురి పెట్టేశారు. ఎన్నికలు 2024లో జరగనున్న నేపధ్యంలో విశాఖను కేంద్ర బిందువుగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.
విశాఖకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న పాయింట్. ముందుగా అధికార పార్టీ వైసీపీని తీసుకుంటే 2020 నుంచే విశాఖను టార్గెట్ చేస్తూ వచ్చింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది. అయితే అది కోర్టులలో ఉండడంతో ఈ ఏడాది అక్టోబర్ 24న విజయదశమి వేళ ముఖ్యమంత్రి జగన్ విశాఖకు మకాం మారుస్తున్నారు.
ఆయన విశాఖ నుంచే ఇక మీదట పాలన సాగిస్తారు అని అంటున్నారు. వారంలో మూడు రోజులు విశాఖలో జగన్ ఉంటారని అని అంటున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి మరో మూడు రోజులు పాలిస్తారు అని తెలుస్తోంది. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలెడితే సహజంగా వైసీపీకి అది ప్లస్ పాయింట్ గా మారుతుంది అని విపక్షాలు ఊహిస్తున్నాయి.
ఇక వైసీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎటూ గ్రేటర్ రాయలసీమలో ఉన్న 74 సీట్లలో మెజారిటీ సీట్లు వైసీపీ పరం అవుతాయి అంటే 50 దాకా సీట్లు అక్కడ తెచ్చుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తోంది ఆ పార్టీ. ఇక మ్యాజికి ఫిగర్ కి తగిన సీట్లు మరో 38 రావాలి. అందులో ఉత్తరాంధ్రాలో 34 సీట్లు ఉన్నాయి. వీటిలో 2019లో వైసీపీ ఏకంగా 28 సీట్లను గెలుచుకుంది. ఈసారి అన్ని కాకపోయినా 20 దాకా సీట్లు గెలుచుకున్నా ఆ సంఖ్య డెబ్బై కి చేరుతుంది. మరో ముప్పయి సీట్లు క్రిష్ణా గుంటూరులతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలో తెచ్చుకుంటే కనీసంగా వంద సీట్లతో అయినా మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని లెక్క వేస్తోంది.
అంటే ఎంత చెడ్డా వైసీపీ తిరిగి గెలవడానికి వీలు చేసుకోవడం కోసం విశాఖలో సీఎం జగన్ మకాం అని అంటున్నారు. దాంతో ఇపుడు విపక్షాలు కూడా విశాఖ మీద ఫోకస్ పెట్టాయి. తెలుగుదేశం పార్టీకి విశాఖలో బలం ఉంది. 2019లో సిటీలో నాలుగు సీట్లూ ఆ పార్టీ గెలుచుకుంది. ఈసారి రూరల్ లో కూడా సీన్ మారుతుంది అని భావిస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ కనుక విశాఖలో ఉంటే వైసీపీ బలం పెరగడం ఖాయం.
అందుకే టీడీపీ కూడా విశాఖ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ఆగస్ట్ 15న విశాఖలో చంద్రబాబు రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు విశాఖలో మేధావులతో కలసి ఆయన సమావేశం నిర్వహించనున్నారు. రానున్న రోజులలో మరిన్ని టూఒర్లు చంద్రబాబు విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో చేపట్టనున్నారు అని అంటున్నారు.
ఇక జనసేన కూడా విశాఖలో పాగా వేయాలని చూస్తోంది. ప్రజారాజ్యం పార్టీ టైం లో విశాఖలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఆ పార్టీకి దక్కాయి. ఇపుడు మరింతగా బలం పెరిగింది అని భావిస్తోంది. దాంతో పవన్ పది రోజుల వారాహి యాత్రను విశాఖలో నిర్వహిస్తున్నారు ఎక్కడికక్కడ వైసీపీని కట్టడి చేయడం ద్వారా ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లను గెలుచుకోవాలని టీడీపీ జనసేన చూస్తున్నాయి. 2014లో బీజేపీ జనసేన టీడీపీ పొత్తులుగా ఉంటే పాతిక సీట్లు ఆ కూటమికి దక్కాయి. ఇపుడు కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు.
దాంతో రాజకీయ రంగస్థలం విశాఖ వైపు మారింది అని అంటున్నారు. నిజానికి గతంలో విశాఖలో రాజకీయ సందడి అంతగా ఉండేది కాదు, ఎపుడైతే వైసీపీ విశాఖను రాజధాని అంటూ ఈ వైపుగా దృష్టి సారించిందో ప్రతిపక్షాలు విజయవాడను వదిలి విశాఖ వైపుగా అడుగులు వేస్తున్నారు. మరో రెండు నెలలలో జగన్ విశాఖకు మకాం మార్చించే పాలనా రాజధానిని పక్కాన పెట్టి రాజకీయ రాజధానిగా విశాఖ మారుతుందని అనడంలో సందేహం లేదని అంటున్నారు.