చంద్రబాబు పేరెత్తకుండా... అంతా జగన్ వ్యూహం...!
జగన్ స్పీచ్ లలో ప్రతీ సారి ఒక ప్రత్యేకత ఏదో ఉంటూ ఉంటోంది. ఈసారి వైఎస్సార్ వాహనమిత్ర నాలుగవ విడత నిధులను విజయవాడలో ఆయన రిలీజ్ చేశారు
జగన్ స్పీచ్ లలో ప్రతీ సారి ఒక ప్రత్యేకత ఏదో ఉంటూ ఉంటోంది. ఈసారి వైఎస్సార్ వాహనమిత్ర నాలుగవ విడత నిధులను విజయవాడలో ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ దాదాపుగా ముప్పావు గంటకు పైగా మాట్లాడారు. అయితే ఆయన అరగంటకు పైగా తమ ప్రభుత్వం చేసిన మంచిని గురించే చెప్పుకున్నారు.
చివరాఖరులో ఆయన చంద్రబాబు మీద ఆయన పాలన మీద తీవ్ర విమర్శలే చేశారు. అయితే ఎక్కడా చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ అని కానీ పేరు ఎత్తకపోవడం విశేషంగా చూడాలి. గత ప్రభుత్వంలో అమరావతి రాజధాని స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కాం, స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం, ఫైబర్ నెట్ స్కాం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ స్కాం గానే పాలన చేశారని గట్టిగానే అటాక్ చేశారు.
వారిది పెత్తందారీ భావజాలం దానితోనే మన పోరాటం అని జగన్ తేల్చేశారు. జగన్ కోసం కాదు పేదల కోసం ఈసారి ఓటేయాలని ఆయన పిలుపు ఇవ్వడం విశేషం. ఏపీలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేరుగా జనం ఖాతాలలోకి వెళ్ళాయని జగన్ అంటూ గత ప్రభుత్వంలో ఇదే బడ్జెట్ ఉంది. మరి ఆ డబ్బులు పేదల ఖాతాలలోకి రాకుండా ఏ జేబులలోకి వెళ్ళిపోయాయో చెప్పాలని ఆయన కోరారు.
గత పాలకుల వెనక ఒక గజ దొంగల ముఠా ఉందని వారే దోచుకో దాచుకో పంచుకో అన్న విధానం అమలు చేస్తూ మొత్తం లక్షల కోట్ల రూపాయల సొమ్ముని కొల్లగొట్టారని ఆయన నిందించారు. వచ్చే ఎన్నికలు మామూలుగా ఉండవని జగన్ అంటున్నారు. ఈసారి జరిగేది కురుక్షేత్ర సంగ్రామమే అన్నారు.
ఇవతల వైపు పేదలు ఉన్నారని, వారిని సమాదరించే ప్రభుత్వం ఉందని, అవతల వైపు పెత్తందార్ల కొమ్ము కాసే పార్టీలు ఉన్నాయని ఈ యుద్ధంలో వైసీపీకి వేసే ప్రతీ ఓటూ పేదలకు అండగా ఉంటుందని, పెత్తందారుల పాలన తిరిగి రాకుండా ఉండేలా చేస్తుందని జగన్ అనడం విశేషం.
ఈ యుద్ధంలో కులాలు మతాలు అన్నవి చూడవద్దని ఆయన కోరడం మరో విశేషం. ఉన్నది ఇటు పేదలు అటు పెత్తందార్లు ఈ రెండు వర్గాలే అని విభజించి మరీ జగన్ చెప్పుకొచ్చారు. తమ పాలన అంతా పేదల కోసం సాగుతోందని, వారికి మంచి చేసే దిశగా సాగుతోందని జగన్ అన్నారు. వైసీపీకి ఓటు కాదు పేదలకే అన్నది గుర్తు పెట్టుకుంటే కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడం జరుగుతుందని అన్నారు.
మొత్తం మీద చూస్తూంటే ఒక వైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఇన్నర్ రోడ్ స్కాం మీద కూడా అరెస్టుల పర్వం కొనసాగేలా ఉంది. ఈ నేపధ్యంలో జగన్ చంద్రబాబు పేరే ఎత్తకుండా చేసిన కామెంట్స్ మాత్రం చర్చనీయాశం అయ్యాయి. అలాగే కులాలు మతాలు లేవు, వాటిని పట్టించుకోవద్దు అంటూ జగన్ ఇచ్చిన పిలుపు మరో వ్యూహంగా చూడాలి.
ఇక రానున్న ఎన్నికల్లో జగన్ చంద్రబాబు పేరుని నేరుగా చెప్పకుండానే టీడీపీ గురించి ఉచ్చరించ కుండానే ప్రత్యర్ధులు అంటూ విమర్శలు చేసుకుంటూ పోతారా అనేది చూడాలి. ప్రత్యర్ధుల గురించి చూడవద్దు వారు చెప్పేది వినవద్దు, వారిని నమ్మవద్దు అని చెబుతున్న జగన్ తమ ఇంట్లో జరిగిన అభివృద్ధి మీదనే ఫోకస్ పెట్టమని ప్రజలను కోరడం వెనక గట్టి వ్యూహమే ఉందని అంటున్నారు. ఇక మీదట జగన్ నోటి వెంట విపక్షాల పేర్లు కూడా వినిపించవంటే అది సరికొత్త వ్యూహంగానే చూడాలని అంటున్నారు.