ఒకే పాట పాడుతున్న వైసీపీ, బీఆర్‌ఎస్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.
వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇటీవల ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ బల్లగుద్ది చెప్పారు. తీరా ఎన్నికల ఫలితాలు వారిద్దరి మైండ్ బ్లాక్ అయ్యేలా వచ్చాయి.
ఇక అంతకుముందు అంటే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి వస్తారని వైసీపీ నేతలు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలతో వైసీపీ నేతలకు దిమ్మతిరిగింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం సోషల్ మీడియాలో కూడా మర్యాదపూర్వకంగానైనా అభినందనలు తెలపకపోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది.
ఇప్పుడు ఇద్దరు దోస్తులు వైఎస్ జగన్, కేసీఆర్ ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్ కు అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా దక్కినా దాన్ని పోగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. మరికొందరు క్యూలో ఉన్నారు.
కాగా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో, ఎక్కడ వైఫల్యం చెందామో విశ్లేషణ, స్వీయ పరిశీలన చేసుకోకుండా అటు జగన్, ఇటు కేసీఆర్ వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. అలాగే ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయ్యింది.
అయితే వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని.. టీడీపీ నేతల సంగతి చూస్తామంటూ వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించడానికి గుంటూరులోని జైలుకు వెళ్లిన వైఎస్ జగన్ ఈ మేరకు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని.. టీడీపీ నేతలను ఇదే మాదిరిగా ౖజñ ల్లో వేస్తామన్నారు. టీడీపీ నేతలను వేయడానికి జైళ్లు కూడా సరిపోని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
ఇక తెలంగాణలోనూ జగన్ మిత్రుడు కేసీఆర్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని.. కాంగ్రెస్ నేతల సంగతి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన అరికపూడి గాంధీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వస్తామని.. అప్పుడు తానేంటో అరికపూడి గాంధీకి రుచి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ఇలా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఒకే పాట పాడుతున్నాయి. ఆ పార్టీలు చెప్పుకుంటున్నట్టు తాము ఇన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు ఎందుకు ఘోరంగా ఓడించారో తెలుసుకోకుండా ఇంకా ప్రతీకార రాజకీయాలకు పాల్పడతామని చెబుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు బీఆర్‌ఎస్, వైసీపీలు తాము అధికారంలోకి వస్తే మీ (కాంగ్రెస్, టీడీపీ) సంగతి చూస్తామని హెచ్చరిస్తే మరి ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తూ కూర్చుంటాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలాగూ బీఆర్‌ఎస్, వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై పగ తీర్చుకుంటాయి కాబట్టి వాళ్ల సంగతి ఇప్పుడే చూస్తే పోలా అని చంద్రబాబు, రేవంత్ రెడ్డి అనుకుంటే వైసీపీ, బీఆర్‌ఎస్ నేతల గతి ఏంకానని అంటున్నారు.