కలెక్టర్‌పై కోపం.. సీఎం జగన్ ఇంటి ముందు ధర్నాకు పేర్ని నాని సిద్ధం..ఏం జరిగింది?
మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ``సీఎం జగన్ ఇంటి ముందు ధర్నాం చేస్తాం`` అని ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఏలూరు జిల్లా పరిషత్ సభ్యులతో పాటు ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పేర్ని నాని వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఏం జరిగింది?
బుధవారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీటీసీలు సహా ప్రొటోకాల్ ప్రకారం.. జిల్లా పరిదిలో ని ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, మచిలీపట్నం నియోజకవర్గాల ఎమ్మె ల్యేలు పేర్ని నాని, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తదితరులు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం 4 గంటల వరకు సమావేశం సాగినా.. ఎలాంటి తీర్మానాలు చేయలేక పోయారు. అదేసమయంలో అనేక సమస్యలపై చర్చించినా.. ఏ నిర్ణయం తీసుకోలేక పోయారు.
దీనికి కారణం.. ఎక్స్ అఫిషియో సభ్యుడైన ఏలూరు జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశాలకు రావాల్సి ఉంది. వారి సమక్షంలో ఆయా సమస్యలపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అయితే.. వారు ఈ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కానీ, ఇదే తొలి సారిఅయితే.. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదు. కానీ, వరుసగా రెండు సమావేశాలకు కూడా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ డుమ్మా కొడుతున్నారు. దీంతో ఒక్కసారిగా జెడ్పీ సభ్యులు అందరూ పేర్ని నానిపై ఒత్తిడి చేశారు.
ఈ నేపత్యంలో మాజీ మంత్రి ఒక్కసారిగా కలెక్టర్‌పై రెచ్చిపోయారు. ``కలెక్టర్‌కు మేం ఎలా కనిపిస్తున్నాం. అసలు మేం ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు. ఆయన కోసం మేం వేచి చూడాలా? మాకు మాత్రం పనులు లేవా? ఇలాగే అయితే.. కలెక్టర్‌పై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తాం. మేమంతా కలిసివెళ్లి తాడేపల్లి వద్ద ధర్నాకు దిగుతాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో ఉంచుకుంటే మంచిది`` అని నాని హెచ్చరించారు.