వైసీపీ టార్గెట్ లిస్టులో జనసేనాని డిలీట్

టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడిగా పేర్కొంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన వైనం తెలిసిందే.

Update: 2024-09-16 21:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడిగా పేర్కొంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన వైనం తెలిసిందే. వైసీపీ అధినేత.. అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీకి చెందిన ముఖ్యనేతలంతా చంద్రబాబును నాలుగు మాటలు అంటే.. పవన్ కల్యాణ్ ను మాత్రం ఏకంగా ఎనిమిది మాటలు అనేవారు. చంద్రబాబును అనేందుకు అన్నో ఇన్నో విషయాలు ఉన్నాయనుకోవచ్చు. పవన్ కల్యాణ్ విషయానికి వస్తే.. ఆయన వ్యక్తిగతానికి చెందిన పెళ్లిళ్ల (అది కూడా అన్నిచట్టప్రకారం చేసుకున్నవే) అంశాన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేసి అనరాని మాటలు అనేవారు.

చేసుకున్నది మూడు పెళ్లిళ్లు.. అది కూడా విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ.. దాన్నో భూతంగా అభివర్ణిస్తూ చేసిన ప్రచారం బ్యాక్ పైర్ అయ్యింది. దీనికి తోడు దశాబ్దానికి పైనే రాజకీయాల్లో ఉంటూ.. నిజాయితీగా పని చేస్తున్నప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించకపోవటం కూడా పవన్ మీద సానుభూతిని పెంచేలా చేసింది. తనను అంటే తప్పించి తనకు తాను మాట అనకపోవటం.. ఎవరైనా తప్పు చేస్తే.. వారి తప్పుల మీదే తప్పించి.. వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం లాంటి అంశాలు ప్రజల్లోకి వెళ్లాయి. అవసరం లేకున్నా పవన్ ను టార్గెట్ చేస్తున్నారన్న భావన కలిగేలా చేశాయి.

దీంతో.. అప్పటివరకు ఆయన మీదా.. ఆయన కమిట్ మెంట్ మీద ఉన్న అనుమానాలు.. సందేహాలు పోయి.. సానుభూతి వెల్లువలా వచ్చింది. స్నేహానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత? నమ్మిన వ్యక్తి కోసం.. అది కూడా ప్రతికూల పరిస్థితుల్లో కలిసి నిలిచిన వైనం అందరిని ఆకట్టుకునేలా చేసింది. సాధారణంగా రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తారు. కుదరకుంటే అవకాశాల్ని తమకు తామే క్రియేట్ చేసుకుంటారు. కానీ.. పవన్ మాత్రం చంద్రబాబు జైల్లో ఉంటే.. ఆ విషయాన్ని తన రాజకీయ ఎదుగుదల కోసం.. తెలుగుదేశం పార్టీని మరింత నిర్వీర్యం చేసేసి.. దాంతో భారీగా లబ్థి పొందాలని భావించలేదు. మిత్రుడికి అండగా నిలుస్తూ.. కష్టంలో అసలుసిసలు స్నేహితుడిగా వ్యవహరించటం అందరిని ఆకట్టుకుంది.

అన్నింటికి మించి పవన్ కల్యాణ్ పరిణితి ఆంధ్రోళ్లను ఆకట్టుకుంది. దీనికి తగ్గట్లే వంద శాతం స్ట్రైకింగ్ రేటుతో ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టారు. పవన్ ఎదుగుదల.. ఆయనపై పెరుగుతున్న సానుభూతి.. సానుకూలతల్ని అంచనా వేయటంలో వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎన్నికల ఫలితాల తర్వాత చేసుకున్న పోస్ట్ మార్టంలో తాము చేసిన తప్పులు అర్థం కావటమే కాదు.. అవసరం లేకున్నా పవన్ ను టార్గెట్ చేయటం తమకు ఎంత డ్యామేజ్ అయ్యిందన్న విషయాన్ని గుర్తించారు.

అక్కడి నుంచి పవన్ ను పట్టించుకోకూడదని.. ఆయన్ను ఉద్దేశించి ఎలాంటి కామెంట్లు చేయకూడదని.. అతడేమైనా తప్పులు చేసినా.. డిప్యూటీ సీఎంగా పొరపాట్లు చేస్తే తప్పించి.. మరే సందర్భంలోనూ నోరు జారకూడదన్న స్పష్టమైన సంకేతాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి తగ్గట్లే.. పవన్ నుంచి కూడా విమర్శల దాడి తగ్గింది. తనను టచ్ చేస్తే తప్పించి.. టార్గెట్ చేసి మరీ మాటలు అనాలన్న ఆలోచన పవన్ లో తక్కువగా ఉంటుంది. అదే విషయాన్ని తాజాగా చేతల్లో కూడా చేసి చూపించారు. మొత్తంగా వైసీపీ టార్గెట్ లిస్టులో పవన్ పేరును డిలీట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఇదెంత కాలం ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News