వైసీపీలో మరో ఇద్దరు...గోడ దూకేందుకేనా ?
వైసీపీకి రాజ్యసభ సభ్యులు టెన్షన్ పెడుతున్నారు. ఆ పార్టీకి ఎపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.
వైసీపీకి రాజ్యసభ సభ్యులు టెన్షన్ పెడుతున్నారు. ఆ పార్టీకి ఎపుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. లోక్ సభ సభ్యులు అయితే 2014 నుంచి 2019 మధ్యలో ఏకంగా నలుగురు మారి వైసీపీని పరేషాన్ చేశారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా 23 మంది దాకా గోడ దూకారు. ఇక పెద్దల సభలో అంటే ఆనాడు వైసీపీకి తక్కువ మందే ఉండడం, ఇతర పార్టీలకు ఆ అవసరం లేకపోవడంతో సేఫ్ అయింది.
ఇపుడు సీన్ అలా లేదు. టీడీపీకి రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా లేరు. ఆ పార్టీ పుట్టాక జీరో అయింది ఇపుడే. దాంతో చరిత్ర కలిగిన టీడీపీ దీనిని అసలు తట్టుకోలేకపోతోంది. మరో వైపు చూస్తే బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ ఉన్నా ఇంకా అదనపు సభ్యులు కలిస్తే ఎన్డీయే మిత్రుల మీద నుంచి కొంత ఆధారపడడం తగ్గుతుందని ఆలోచిస్తోంది.
జనసేన చూస్తే లోక్ సభ అసెంబ్లీ శాసనమండలిలో ప్రాతినిధ్యం సంపాదించింది. ఇక మిగిలింది రాజ్యసభ. ధర్మంగా కూర్చుంటే 2026 వరకూ ఖాళీ అయ్యే సీన్ లేదు. ఇపుడు వైసీపీని ఆకట్టుకుంటే తమ వారిని వెనువెంటనే రాజ్యసభకు పంపించుకోవచ్చు. అక్కడ తమ కోసమే రిజర్వ్ చేసిన కేంద్ర మంత్రి పదవిని కూడా పొందవచ్చు.
ఇలా టీడీపీ కూటమిలోని మూడు పార్టీలూ తమ అవసరాలను బేరీజు వేసుకుంటూ వైసీపీని టార్గెట్ చేయడంతో ఫ్యాన్ పార్టీ సతమతమవుతోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్న వైసీపీకి ఇపుడు ఈ గోడ దూకుళ్ళు కలవరం పెంచుతున్నాయి.
నిన్నటికి నిన్న వైసీపీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు రాజీనామా చేశారు. అలా షాక్ తినిపించారు. ఇక టీడీపీ నుంచే వచ్చిన బీద మస్తాన్ రావు సంగతి చెప్పనవసరం లేదు. ఈ నేపధ్యంలో వైసీపీకి రాజ్యసభలో మిగిలిన తొమ్మిది మందిలో ఎవరు ఏ వైపు ఉంటారు అన్నది బీపీని పెంచుతోంది.
వైసీపీలోనే ఉంటామని విజయసాయిరెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఎటూ జగన్ బాబాయ్ కాబట్టి ఆయన గురించి చింతించాల్సినది లేదు. ఈ ఇద్దరూ కాకుండా ఇంకా ఎవరు నమ్మకస్తులు అంటే కడప జిల్లాకు చెందిన మేడ రఘునాధరెడ్డి తాను వైసీపీలోనే ఉంటాను అని ఒక గంభీరమైన ప్రకటన చేశారు. వదంతులను నమ్మవద్దు అని కోరారు
అదే విధంగా చూస్తే కనుక మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తాను హానెస్టీ కలిగిన నేతను అని చెప్పుకున్నారు. జగన్ తోనే తన ప్రయాణం అని కచ్చితంగా చెప్పేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం అంటే విలువలు కోల్పోవడమే అని కూడా చెప్పారు. సో ఈ ఇద్దరూ కూడా గ్యారంటీ అని వైసీపీ లెక్క వేసుకుంటోంది.
అదే విధంగా జగన్ కేసులు చూసే లాయర్ నిరంజన్ రెడ్డి కి ఈ ఫిరాయింపులు అవసరం లేదని అంటున్నారు. ఆయన పెద్దల సభకు వెళ్లాలని కోరికతో ఉంటే దానిని జగన్ తీర్చారని అందువల్ల ఆయన తన పదవీకాలం హ్యాపీగా కంప్లీట్ చేస్తారు అని అంటున్నారు. గుజరాత్ కి చెందిన పరిమళ్ నత్వానీ కేంద్ర బీజేపీ పెద్దలకు సన్నిహితుడు. ఆయన పార్టీ మారి రావాల్సినది లేదు. ఎక్కడ ఉన్నా శ్రేయోభిలాషి కాబట్టి ఆయన ఇపుడు అర్జంటుగా రాజీనామా చేసి రారు అని అంటున్నారు.
అలాగే మరో కీలక నేత ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నయ్య. ఆయన వైసీపీలో అతి ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఆయన మీద ప్రచారం గట్టిగా సాగినా తాను వైసీపీకి బద్ధుడను అని చెప్పేశారని టాక్. సో ఆ ఎంపీ కూడా వైసీపీలోనే అని అంటున్నారు.
అయితే మరో ఇద్దరు ఎంపీల విషయంలో మాత్రం డౌటానుమానాలు పెరిగిపోతున్నాయట. ఆ ఇద్దరే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబూరావు, అలాగే తెలంగాణాకు చెందిన బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య. గొల్ల బాబూరావు అయితే కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయనను వైఎస్సార్ తీసుకుని వచ్చారు.
ఆ తరువాత జగన్ వెంట నడచారు. ఆయనకు విస్తరణలో మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉంది. అప్పట్లో ఆయన ఎంత గొడవ చేయాలో అంతా చేశారు. ఆ తరువాత సర్దుకున్నారు. ఇక 2024లో ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టుబట్టారు. రాజ్యసభ ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అయినా ఇక్కడితో తన రాజకీయ జీవితం ఆగిపోతుందని ఆయనకు తెలుసు. దాంతో ఏమైనా ఆఫర్లు ఉంటే ఆయన గోడ దూకడం ఖాయమని అంటున్నారు.
ఆయన నుంచి పార్టీ మారను అని స్టేట్మెంట్ రావడం లేదు అని అంటున్నారు. అలాగే ఎక్కడో తెలంగాణాకు చెందిన బీసీ నేత అని క్రిష్ణయ్య. పదవి ఇచ్చారు. అప్పట్లో అది వివాదంగా కొంత పార్టీలో మారింది. అయితే ఆయన కూడా ఊగిసలాడుతున్నారని అంటున్నారు. ఆయన టీడీపీలో మొదట ఉన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసారు. సో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది వైసీపీకి షాక్ అవుతుంది అని అంటున్నారు. ఇలా వైసీపీ పార్టీలో చేసుకున్న పోస్ట్ మార్టంలో ఏడుగురు ఎంపీలు కన్ ఫర్మ్ అని తేల్చుకుందంట.