రాత్రి 7 గంటలకు ఏమవుతుంది? వైసీపీ సస్పెన్స్ ట్వీట్

‘‘ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతిపెద్ద రహస్యం బయటపడనుంది.’

Update: 2025-02-18 08:11 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. వంశీ తర్వాత మరికొందరు వైసీపీ నేతలను జైలుకు పంపుతామని టీడీపీ నేతలు హెచ్చరిస్తుండగా, వంశీ అరెస్టులో కుట్ర కోణం ఉందంటూ వైసీపీ ఫైర్ అవుతోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్థన్ తన ఫిర్యాదును వాపసు తీసుకున్నా, కుట్ర పన్ని వంశీని అరెస్టు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా వంశీ అరెస్టుకు దారితీసిన పరిణామాల్లో ఓ పెద్ద రహస్యాన్ని బయటపెడతామని వైసీపీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. దీంతో ఆ రహస్యమేంటన్న విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

‘‘ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతిపెద్ద రహస్యం బయటపడనుంది.’’ అని వైసీపీ చేసిన ట్వీట్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ రహస్యం ఏంటంటూ అధికార, ప్రతిపక్షాల్లో చర్చించుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సస్పెన్స్ ట్వీట్ రావడం ఇది రెండోసారి అంటూ కొందరు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా అధికార, ప్రతిపక్షాలు ఓ సారి ఓ రహస్య సమాచారాన్ని బయటపెడతామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు. అయితే ఆ రహస్యాలు మాత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. పైగా ప్లాప్ సినిమాలా తుస్ మన్నాయంటున్నారు.

గతంలో మాజీ సీఎం జగన్, ఆయన తల్లి, చెల్లి మధ్య సరస్వతి పవర్ వాటాల పంపకంపై కోర్టులో పిటిషన్ దాఖలు సందర్భంగా టీడీపీ ఓ రహస్యాన్ని బయటపెడతానని ట్వీట్ చేసింది. దీనికి కైంటరుగా వైసీపీ కూడా కూటమి పరువు బజారున పడే విషయాలు వెలుగులోకి తెస్తామని ట్వీట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసింది. తీరా ఇరుపార్టీలు ఆయా విషయాలను బయటపెట్టేసరికి.. ఓస్ ఇంతేనా అంటూ జనం తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు కూడా వైసీసీ చేసిన సస్పెన్స్ ట్వీట్ ఆసక్తికరంగా ఉన్నా, అందులో ఏ విషయం ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారును కిడ్నాప్ చేశారని మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దాడి కేసును తాను ఉపసంహరించుకుంటున్నట్లు అంతకుముందు బాధితుడు కోర్టులో వాంగ్మూలమిచ్చాడు. వంశీ అండ్ కో బెదిరించడం వల్లే బాధితుడు భయపడి ఫిర్యాదును వాపసు తీసుకున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై బాధితుడు సత్యవర్థన్ నిన్న మరోమారు కోర్టులో హాజరయ్యాడు. మేజిస్ట్రేట్ ఎదుట సుమారు రెండు గంటలపాటు వాంగ్మూలమిచ్చాడు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో అనేక ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. ఇక వైసీపీకి తెలిసిన రహస్యమేంటో కానీ వెంటనే చెప్పకుండా.. టైం చెప్పి వెయిట్ చేయమని చెప్పడంతో అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News