ఉక్కు లాంటి చాన్స్ వైసీపీ మిస్ ?
ఏపీలో నిన్నటిదాకా రాజ్యమేలిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోతున్నట్లుగా కేంద్రం సంకేతాలు ఇచ్చింది
ఏపీలో నిన్నటిదాకా రాజ్యమేలిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ అధికారంలో ఉండగానే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయబోతున్నట్లుగా కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఆనాటి నుంచి విశాఖ ఉక్కుకు క్షీణ దశ తప్ప కొత్త కాంతులు అయితే లేవు. అధికారంలో ఉన్నపుడు వైసీపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే అఖిలపక్షంతో కేంద్రాన్ని కలుద్దామని ఆనాడు విపక్షాలు చెప్పినా వైసీపీ పట్టించుకోలేదు. మొత్తానికి వైసీపీ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయబోమన్న ఒక్క మాటను కేంద్రం చేత చెప్పించ లేకపోయింది.
విశాఖతో పాటు ఉత్తరాంధ్రాలో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే రావడం వెనక ఉక్కు కార్మికుల ఆగ్రహం కూడా ఉందని విశ్లేషణలు ఉన్నాయి. గతంలో ఓటమికి గల కారణాలను పరిశీలించుకుని గట్టిగా నిలబడేందుకు పోరాడాల్సిన అవసరం అయితే ఏ పార్టీకి అయినా ఉంటుంది.
వైసీపీ ఇపుడు ప్రతిపక్షంలో ఉంది. ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడవచ్చు. ఆనాడు టీడీపీ జనసేన ఇదే చేశాయి. మరి వైసీపీ అయితే విశాఖ ఉక్కు మీద గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదూ అన్న చర్చ సాగుతోంది.
బలం తక్కువగా ఉన్నా కాంగ్రెస్ తన గొంతు వినిపిస్తోంది. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కు మీద కీలక ప్రకటన చేయాల్సిందే అని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటంలో మొదటి నుంచి చురుకుగా పాల్గొంటున్న వామ పక్షాలు అయితే మోడీ విశాఖ వస్తున్న వేళ తమ గొంతుని మరింతగా పెంచాయి.
మోడీ స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన ప్రకటన చేసి తీరాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. విశాఖలో వామపక్షాలు నిరసనలు నిరవధిక దీక్షలు ఆందోళనలూ చేపడుతున్నాయి. మరి వైసీపీ నుంచి ఎందుకు ఈ తరహా ఆందోళనలు కనిపించడం లేదు అన్న చర్చ సాగుతోంది. వైసీపీ కూడా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయవద్దు అని కోరుతోంది.
మరి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్న వేళ వైసీపీ తన డిమాండ్ ని ఆయన ముందు పెట్టాలి కదా అని అంటున్నారు. ఉక్కు లాంటి ఈ సమస్యను కీలక పార్టీ అయిన వైసీపీ టేకప్ చేసి ఉంటే పొలిటికల్ గా కూడా మైలేజ్ వేరే లెవెల్ లో వస్తుంది కదా అని అంటున్నారు.
తెలుగుదేశం జనసేన బీజేపీలు కూటమి కట్టాయి. మూడు పార్టీలూ అధికారంలో ఉన్నాయి. వారికి వ్యతిరేకంగా ఒక విపక్షంగా గళం విప్పితే జనాలకు కూడా ఎవరేమిటి అన్నది అర్ధం అవుతుంది కదా అని అంటున్నారు. వామపక్షాలు కాంగ్రెస్ తో పాటు వైసీపీ కూడా గొంతు కలిపి మోడీని డిమాండ్ చేసినట్లు అయితే ఉక్కు ఉద్యమానికి మరింతగా రాజకీయ బలం వచ్చేదని అంటున్నారు.
అయితే వైసీపీ నేతలు మాత్రం వీధుల్లోకి వచ్చి ప్రత్యక్ష పోరాటానికి ఎందుకో ఆసక్తిని చూపించడం లేదని అంటున్నారు అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ అని ఆయనకు ఎదురు నిలిచి పోరాడడం ఎందుకు అని ఆగుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ప్రజల డిమాండ్ ని ప్రజల మనసెరిగి సరైన సమయంలో అంది పుచ్చుకుని చేసే కార్యక్రమాలతోనే ప్రతిపక్షాలకు పేరు వస్తుంది. ఆ విధంగా చూస్తే ఉక్కు లాంటి చాన్స్ వైసీపీకి వచ్చిందని అంటున్నారు. దానికి ఆ పార్టీ సద్వినియోగం చేసుకోవాల్సింది అని అంటున్నారు. కేవలం మీడియా ముఖంగా స్టేట్మెంట్స్ ఇచ్చేకంటే ప్లే కార్డులతో మోడీ రోడ్ షో ఎదురుగా లేక ఆయన సభా ప్రంగణం వద్ద వైసీపీ తన ఆందోళన తెలియచేస్తే విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి న్యాయం జరుగుతుంది. కానీ వైసీపీ అయితే ఎందుకో ఈ నిరసన విషయంలో సైలెంట్ అయింది అని అంటున్నారు.