ఏపీ లాంటి స్టేట్ ఉంటే మోడీ అయిదేళ్ళూ ప్రధానే !
దేశంలో ఎక్కడా లేని రాజకీయం ఏపీలో ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా భావించడంలేదు.
దేశంలో ఎక్కడా లేని రాజకీయం ఏపీలో ఉంది. ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రత్యర్థులుగా భావించడంలేదు. శతృవులుగా ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. దాంతో అవతల పక్షాన్ని అణచాలని ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇది కాస్తా కేంద్రంలోని బీజేపీకి బాగా ఉపయోగపడుతోంది.
కెంద్రం సాయంలో ఏపీలో ప్రత్యర్ధిని పూర్తిగా దెబ్బ తీయాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తే ఆ పరిస్థితి లేకుండా చేసుకోవడానికి ప్రత్యర్ధి పక్షం కూడా కేంద్రంలో బీజేపీకి జై కొడుతోంది. 2014 నుంచి ఇదే కధ సాగుతోంది. ఉమ్మడి ఏపీలో ఈ విధంగా లేదు. ప్రతిపక్షాలు అంటే వారి రాజకీయ విధానం వేరుగా ఉండేది.
కానీ గత పదేళ్ళుగా చూస్తే టీడీపీ వైసీపీ ఢిల్లీలో దోస్తీ ఏపీలో కుస్తీ అన్నట్లుగా సాగుతున్నాయి. దీని వల్ల ఏపీకి మేలు జరగకపోగా బీజేపీ ఈ రెండు పార్టీలను తన రాజకీయ అవసరాలకు ఎంచక్కా వాడుకుంటోంది. కేంద్రంలో బీజేపీకి లోక్ సభలో తెలుగుదేశంతో అవసరం ఉంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు
దాంతో ఎన్డీయేలోకి చేర్చుకుంది. మూడు పార్టీలు కలసి పోటీ చేసి తాజా ఎన్నికల్లో గెలిచాయి. అలా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరింది. ఏపీ మంత్రివర్గంలో బీజేపీ చేరింది. ఇది ఒక రాజకీయ విధానం. దీనిని తప్పు పట్టాల్సింది లేదు. మరి ఏపీలో టీడీపీ బీజేపీతో పోటీ పడి చిత్తుగా ఓటమి పాలు అయిన వైసీపీ రాజకీయ విధానం ఎలా ఉండాలి. ఈ పార్టీలకు పూర్తి భిన్నంగా ఉండాలి.
బీజేపీ ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి వారు దూరంగా ఉండాలి. కానీ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఎన్డీయేకు బయట నుంచి మిత్రుడిగా వైసీపీ మారిపోయింది. దానికి కారణం వైసీపీ సొంత అవసరాలు తప్ప ఏపీ ప్రయోజనాలు ఏమీ కావు అని అంటున్నారు. ఒక వేళ ఏపీ ప్రయోజనాలు ఉండి ఉంటే ప్రత్యేక హోదా మీద కండిషన్ పెట్టాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణను ఆపు చేయించాలి. విభజన హామీలను తీర్చాలని కోరాలి.
అసలు ఈ ఆయాసం అంతా ఎందుకు కూటమి కట్టిన పార్టీలు అవన్నీ చూసుకుంటాయి. తనకు ప్రత్యర్థిగా ఎదురు నిలిచి తనను ఓడించిన పార్టీకి మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ఎక్కడైనా చూశారా అని అంతా అంటున్నారు. అది ఏపీ విషయంలోనే జరిగింది అని అంటున్నారు. అది కొత్త ఏమీ కాదు, 2014 నుంచి 2019 దాకా కూడా ఇలాగే వైసీపీ మద్దతు ఇచ్చింది. ఆనాడూ బీజేపీ టీడీపీ కలసి వైసీపీని ఓడించాయి. అయినా ఓకే అనుకుని మద్దతుగా నిలిచింది.
ఇక 2019 నుంచి 2024 దాకా తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది. రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడమే కాదు కీలకమైన బిల్లులలోనూ మద్దతు ఇస్తూ వచ్చింది. ఆనాడు ఏపీలో టీడీపీని టార్గెట్ చేసి మరీ బీజేపీ ఓడించినా టీడీపీ అదే బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఈ వింత రాజకీయం మూలంగానే ఏపీ ప్రయోజనాలు పూర్తిగా పక్కకు పోతున్నాయని అంటున్నారు
ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వైసీపీకి ఏమి అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. అయినా సరే గతంలో చంద్రబాబు అనుసరించిన విధానమే ఇపుడు జగన్ అనుసరిస్తారు. ప్రత్యేక హోదా జగన్ అడగలేదు, స్టీల్ ప్లాంట్ జగన్ ప్రైవేట్ పరం చేస్తున్నారు అని బాబు ఆరోపించేవారు.ఈ విషయాలు కేంద్ర పరిధిలో అని తెలిసినా ఆయన బీజేపీని పల్లెత్తు మాట అనేవారు కాదు.
ఇపుడు జగన్ అదే చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలో మళ్లీ ఆయన గొంతు విప్పుతారు. అలాగే స్టీల్ ప్లాంట్ విషయంలో తప్పు టీడీపీదే అంటారు. ఇలా రెండు పార్టీ ఏపీ గల్లీలో రాజకీయ రచ్చ చేసుకుంటాయి కానీ బీజేపీని పల్లెత్తు మాట అనవు. అదే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా కావాల్సింది.
వైసీపీ అవసరం రాజ్యసభలో బీజేపీకి ఉంది అక్కడ ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీయేకు పూర్తి బలం లేదు. దాంతో జగన్ ని అలా చేరదీస్తున్నారు అని అంటున్నారు. ఇలా జగన్ తో ఉంటూ బాబుకు అలా బాబుని ఎన్డీయేలో చేర్చుకుని జగన్ కి చెక్ పెడుతూ బీజేపీ కేంద్ర పెద్దలు తమ రాజకీయాన్ని బాగా కొనసాగిస్తున్నారు అని అంటున్నారు.
ఎన్డీయేకు లోక్ సభలో 293 మంది ఎంపీల మద్దతు ఉంది, వైసీపీ మద్దతుతో అది 297కి పెరిగింది. ఇపుడు ఇందులో నుంచి టీడీపీ 16 మందిని మైనస్ చేసినా ఎన్డీయే బలం 281 అవుతుంది. అంటే టీడీపీ ఏమీ అనకుండా ఇలా బయట మద్దతు అన్న మాట. అలాగే వైసీపీని చెక్ పెట్టేందుకు ఎటూ ఏపీలో ఎన్డీయే సర్కార్ ఉంటుంది. ఇలా రెండు పార్టీలను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ పోతున్న బీజేపీ ఆ పార్టీ అధినేత మోడీ అయిదేళ్ళూ అధికారంలో ఉంటారు అనడానికి ఎలాంటి సందేహాలూ లేవనే అంటున్నారు. ఎనీ డౌట్స్.