జగనన్న ఎందుకు ఓడారో అభిమానులే చెబుతున్నారు !
జగన్ అంటే వారికి ప్రాణం. అన్న సీఎం గా ఎప్పటికీ ఉండాలని కోరుకున్నారు. సోషల్ మీడియాలో ఒక సైన్యంగా పనిచేశారు.
జగన్ అంటే వారికి ప్రాణం. అన్న సీఎం గా ఎప్పటికీ ఉండాలని కోరుకున్నారు. సోషల్ మీడియాలో ఒక సైన్యంగా పనిచేశారు. అయితే వైసీపీ గెలుపు సంగతి పక్కన పెడితే ఓటమి ఇంత దారుణంగా ఘోరంగా ఉంటుందని కలలో కూడా అభిమానులు ఊహించలేకపోయారు. చరిత్రలో అలాంటి ఓటమి జగన్ ని వరించింది. దాని మీద సోషల్ మీడియా వేదికగా అభిమానులు కనుగొన్న కారణాలు ఏమిటి అన్నది చూస్తే చాలా ఆసక్తిగా ఉన్నాయి. సంచలనంగా కూడా ఉన్నాయి.
ఆ వివరాలు చూస్తే కనుక జగన్ ఒంటెద్దు పోకడలు అని సొంత అభిమానులే చెప్పేశారు. ఎపుడూ సంక్షేమం అంటూ అభివృద్ధిని పక్కన పెట్టడం, తన పార్టీ ఎమ్మెల్యేలను నేతలను జగన్ ఏ మాత్రం పట్టించుకోకపోవడం, వైసీపీ ఎమ్మెల్యేలు అయితే కింది స్థాయి క్యాడర్ ని అసలు పట్టించుకోకుండా ఎదగనీయకుండా చేయడం.
చేతిలో అధికారాన్ని చూసుకుని ఎమ్మెల్యేలు అనుచరులు పూర్తిగా అవినీతికి దోపిడీకి తెర తీయడం, మొత్తం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం. ప్రభుత్వ ఉద్యోగుల మీద అనుచితమైన వైఖరిని అనుసరించడం, చాలా మంది మంత్రుల నోటి దురుసు. అలాగే అభ్యర్థులను ఎన్నికలు దగ్గర పెట్టుకుని జగన్ ఇష్టం వచ్చినట్లుగా మార్చేయడం అని చెబుతున్నారు.
అంతే కాదు ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే మద్యం విధానంలో నిజాయతీ చిత్తశుద్ధీ ఎక్కడా లేదు అని అంటున్నారు. సింగిల్ సోలో అంటూ రాజకీయాల్లో మిత్రులు ఉండాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించడం అలాగే బీజేపీ టీడీపీ జనసేన కూటమిని లైట్ తీసుకోవడం అని అంటున్నారు.
అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఆయన మూడు పెళ్ళిళ్ళను జగన్ నుంచి అందరూ విమర్శలు చేయడం వల్ల ఏపీలో బలమైన కాపు తెలగ బలిజ కులస్తుల బాగా మనసులు గాయపరచుకున్నారని కూడా అభిమానులు విశ్లేషించారు.
అలాగే వాపుని బలం అనుకుని లోకల్ బాడీ ఎన్నికల్లో అన్నీ ఏకగ్రీవాలు చేసుకోవడం వల్ల పార్టీ బలం అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది అంటున్నారు. అలాగే సొంత కుటుంబ సమస్యలను జగన్ పట్టించుకోకపోవడంతో షర్మిల వేరే పార్టీలో చేరారు అన్నది జనంలో చర్చకు వచ్చింది. అంతే కాదు సొంత తల్లి విజయమ్మ షర్మిలను గెలిపించమంటూ వీడియో పెట్టడంతో జగన్ కి ఆమె మద్దతు లేదని జనాలకు తెలిసిపోయింది అని అంటున్నారు.
ఏ పార్టీ అయినా నాయకులు క్యాడర్ మీద ఆధారపడుతుంది, కానీ వాలంటీర్ల మీద వైసీపీ ఆధారపడడం అతి పెద్ద తప్పు అని సొంత పార్టీ అభిమానులే ఎత్తి చూపారు. భూముల పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకోవడం కూడా తప్పే అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణలు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ ఉండడం ఎంతో డ్యామేజ్ చేసింది అని అంటున్నారు.
ఏకంగా సొంత సామాజిక వర్గంలోనే జగన్ మీద అత్యధిక శాతం గుర్రుగా ఉండడడం, అనర్హులను అందలం ఎక్కించి పనిచేసే వారిని సైడ్ చేయడం ఇలా ఒక తప్పు కాదు చాలానే ఎత్తి చూపారు. ఇక జగన్ భజనకు అలవాటు పడ్డారని తనను ఎవరైతే పొగుడుతారో వారినే పక్కన ఉంచుకుంటారు అని కూడా వైసీపీ అభిమానులు వేస్తున్న మరో విమర్శ.
ఇక వైసీపీ ప్రభుత్వంలో పార్టీలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత కీలకంగా వ్వహరించడం మాట్లాడాల్సిన సీఎం తెర వెనకన ఉండడంతో ప్రభుత్వం ఎవరిది తాము ఓట్లేసింది ఎవరికి అన్న భావన సగటు జనంలో వచ్చేసింది. అదే తెగ చికాకు పెట్టించి వైసీపీని దెబ్బ కొట్టిందని చాలా ఆలోచింపచేసే విశ్లేషణతోనే వైసీపీ అభిమానులు ఓటమికి వంద కారణాలు చెప్పారు.
అంతే కాదు ఎన్నికల ముందు వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను ఎక్కడా ప్రతిబింబించలేదని కూడా తేల్చేశారు. నిజంగా అభిమానులు చేసిన ఈ విశ్లేషణ వైసీపీ పెద్దలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే ఎంతో కొంత మేలు జరుగుతుంది అని అంటున్నారు.