వివేకా హత్య కేసు : వైసీపీ కోర్టుకు వెళ్తుందా...!?
వైఎస్ వివేకా హత్య జరిగి అయిదేళ్ళ మీద ఒక నెల కూడా గడచింది. 2019 ఎన్నికల్లో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది.
వైఎస్ వివేకా హత్య జరిగి అయిదేళ్ళ మీద ఒక నెల కూడా గడచింది. 2019 ఎన్నికల్లో ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. నాడు కూడా టీడీపీ వైసీపీ ఈ కేసుని ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నాయి. ఒక దశలో ఈ కేసు మీద తీవ్ర ఆరోపణలు టీడీపీ చేస్తూంటే న్యాయపరంగా దాన్ని వైసీపీ అడ్డుకుంది. విచారణలో ఉన్న కేసు గురించి మాట్లాడవద్దు అని బ్రేకులు వేయించింది.
సరిగ్గా ఇపుడు అదే కేసుని తిరగతోడుతున్నారు. వైఎస్ సునీత వైఎస్ షర్మిల ఈ కేసు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. వైఎస్ సునీత అయితే ఇటీవల అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చాలా విషయాలే మాట్లాడారు. వివేకం సినిమాలో కంటే రియాలిటీలోనే ఎక్కువ జరిగింది అంటూ ఆమె ఆ సినిమా కధాంశం కరెక్ట్ అన్నట్లుగా చెప్పేశారు.
ఇక వైసీపీ కీలక నేతల వ్యక్తిత్వం హననం చేసేందుకు కూడా ఈ కేసుని మరోసారి వాడుకోవాలని విపక్షాలు చూస్తున్నాయి.వైఎస్ షర్మిల అయితే ఏకంగా తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పట్టుకుని వివేకా కేసులో దోషిగానే ఆరోపించడం పట్ల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశం మీద ఎలా మాట్లాడుతారు అని ఆయన ప్రశ్నించారు. ఇపుడు సరిగ్గా ఇదే పాయింట్ మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి పట్టుకుంటున్నారు జగన్ ఇమేజ్ ని ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా తాము కోర్టుని ఆశ్రయిస్తామని అంటున్నారు. ఆ విధంగా వారి దూకుడుకు బ్రేకులు వేస్తామని అంటున్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఇక వైఎస్ షర్మిల చూస్తే కడప నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆమె ఎక్కువగా వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతారు అని అంటున్నారు. చిన్నాన్న చివరి కోరిక తనను ఎంపీగా చూడడం అంటూ ఆమె తరచూ చెబుతున్నారు. మొత్తానికి ఈ సెంటిమెంట్ వాడుకుంటేనే అక్కడ ఆమె రాజకీయం కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు.
దాంతో ఈ ఇష్యూ మీద కోర్టుకు వెళ్ళి అయినా ఎన్నికల్లో వివేకా హత్య కేసు మీద ఎవరూ మాట్లాడకుండా చేయాలని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ వ్యూహం ఏంటో దానికి విపక్షాల కౌంటర్ వ్యూహం ఏంటో కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ఏది ఏమైనా వివేకా హత్య కేసుని మరోసారి జనంలో చర్చకు పెట్టాలని కాంగ్రెస్ సహా టీడీపీ చూస్తున్నాయి.
అసలు కోర్టు విచారణలో ఉన్న ఈ కేసుని ఎలా జనంలోకి తెచ్చి తీర్పులు ఇచ్చేస్తారు అని వైసీపీ అంటోంది. దాంతో కోర్టు జోక్యం తప్పదా అన్న ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి.