వైసీపీలో వంద సీట్లకు ఫుల్ క్లారిటీ ...?

వైసీపీ రానున్న ఎన్నికల విషయంలో తెర వెనక చేయాల్సిన ఎక్సర్ సైజ్ అంతా చేస్తోంది.

Update: 2023-09-05 11:10 GMT

వైసీపీ రానున్న ఎన్నికల విషయంలో తెర వెనక చేయాల్సిన ఎక్సర్ సైజ్ అంతా చేస్తోంది. ఈసారి కనుక గెలిచేస్తే ఏపీలో తమకు తిరుగులేదని భావిస్తోంది. విపక్షాలు కూడా డీలా పడతాయని, మరిన్ని ఎన్నికలకు ఇదే ఎన్నికల ఫలితాలు గట్టి పునాదులు వేస్తాయని కూడా లెక్క వేస్తోంది.

దాంతో ఈసారి ఎన్నికలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంది. కచ్చితంగా గెలవాలి. అంతే కాదు ఈ గెలుపు రీ సౌండ్ చేయాలి అన్నది కూడా వైసీపీ పట్టుదలగా ఉందని అంటున్నారు. ఇక మొత్తం 175 సీట్లలో 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను గెలుచుకుంది. ఆ తరువాత మరో నలుగురు వచ్చి పార్టీకి జై కొట్టారు. అలా చూసుకుంటే 155 సీట్లు వైసీపీ ఖాతాలో ఉన్నాయి. ఇందులో నుంచి నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది.

ఇలా చూసుకుంటే సిట్టింగులలో వైసీపీ ఎంతమందికి టికెట్ ఇస్తుంది అన్నది ఒక వైపు చర్చగా ఉంది. మరో వైపు చూస్తే సస్పెండ్ చేసిన రెబెల్స్ ప్లేస్ తో ఇంచార్జులను నియమించింది. అలాగే మిగిలిన 19 సీట్ల విషయంలో కూడా వైసీపీ ఒక అవగాహనతో ఉందని అంటున్నారు. వై నాట్ 175 అంటూ సమర నినాదం చేస్తున్న వైసీపీ వంద దాకా అభ్యర్ధులను ఖరారు చేసేసింది అని ప్రచారం సాగుతోంది.

ఈ వందమంది బలమైన అభ్యర్ధులు కచ్చితంగా గెలుస్తారని, వారి నియోజకవర్గాలలో రేసులో ఎవరు ఉన్నా వారే గెలుపు గుర్రాలు అని అంచనాకు వచ్చి వారి పేర్లను ఖరారు చేసింది అని అంటున్నారు. అలా కనుక చూస్తే వైసీపీకి ఇది తొలి జాబితా అని భావించాలి. అయితే వైసీపీకి మొదటి నుంచి జాబితాలు విడతలవారిగా విడుదల చేయడం అలవాటు లేదు.

అందువల్ల మిగిలిన 75 సీట్లలో కూడా అభ్యర్ధులను ఎంపిక చేసిన మీదటనే టోటల్ గా మొత్తం అందరి పేర్లతో పూర్తి జాబితా రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు. అయితే క్లారిటీ ఉన్న వంద సీట్ల విషయంలో పెద్దగా పేచీ పూచీలు ఉండవు కానీ ఆ 75 సీట్ల దగ్గరే పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇందులోనే ఒక పాతిక మంది దాకా సిట్టింగులకు టికెట్లు డౌట్లు అని కూడా అంటున్నారు.

వారి పనితీరు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత, ఈసారి టికెట్ ఇస్తే వారు గెలిచే విషయంలో అధినాయకత్వానికి ఉన్న సందేహాలు అన్నీ కలసి పాతిక మంది దగ్గర నంబర్ ఆగింది అని అంటున్నారు. మరి వారందరినీ కాదంటారా లేక చివరి నిముషంలో వారి పనితీరులో మార్పు కంపిస్తే టికెట్లు ఇస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఎలా చూసుకున్నా ఎన్నికలకు దగ్గరగా వచ్చిన వేళ వ్యతిరేకత కనుక ఉంటే అది మాత్రం ఇంత తక్కువ టైంలో తుడిచిపెట్టుకుని పోయేది కాదు అని అంటున్నారు.

అందువల్ల పాతిక మందికి కాకపోయినా అందులో ఎక్కువ మందికే ఈసారి టికెట్లు కట్ అనవచ్చు అని అంటున్నారు అదే విధంగా చూసుకుంటే మిగిలిన యాభై సీట్లలో కూడా పోటీ చాలా తీవ్రంగా ఉంది అని అంటున్నారు. అలాంటి సీట్లలో ముగ్గురు నలుగురేసి రేసులో ఉన్నారు. వీరి నుంచి సరైన అభ్యర్ధిని ఎంపిక చేయడం మిగిలిన వారు పార్టీ గట్టు దాటకుండా చూసుకోవడం పెద్ద సమస్య అని అంటున్నారు.

అలా కనుక చూసుకుంటే వైసీపీలో ఈ సీట్లకు అభ్యర్ధులని నిర్ణయించేటపుడే రాజకీయంగా సంచలన పరిణామాలు జరుగుతాయని చాలా మంది బయటకు రావచ్చు అని ప్రత్యర్ధి పార్టీలు ఊహిస్తున్నాయి. అయితే ఎంత మేరకు వారిని సంతృప్తి పరచి తాము అనుకుంటున్న వారికి టికెట్లు ఇస్తారన్న దాని మీదనే వైసీపీ అధినాయకత్వం చాణక్యం ఆధారపడి ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీలో మాత్రం మెజారిటీ సీట్లకు అభ్యర్ధులు అయితే కన్ ఫర్మ్ అయ్యారనే ప్రచారంలో ఉన్న మాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News