వైసీపీ దుట్టా... టీడీపీతో చెట్టా పట్టా...?

వైసీపీలో సీనియర్ లీడర్ గా దుట్టా రామచంద్రరావు ఉన్నారు. ఆయన గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కీలక నేత.

Update: 2023-08-20 14:18 GMT

వైసీపీలో సీనియర్ లీడర్ గా దుట్టా రామచంద్రరావు ఉన్నారు. ఆయన గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కీలక నేత. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసింది అతనే. వంశీ మీద ఏకంగా 9,500 ఓట్ల తేడాతో దుట్టా ఓడిపోయారు. ఆ తరువాత కూడా ఆయన పార్టీలో ఉన్నారు. వైసీపీలో వంశీ వచ్చేంతవరకూ దుట్టా, యార్లగడ్డ వర్గాల మధ్య పోరు ఉండేదని ప్రచారంలో ఉంది.

అయితే ఆ తరువాత ఇద్దరూ కలసిపోయారు. ఇక ఈ మధ్య రాజకీయంగా హడావుడి చేసి టీడీపీ కండువా కప్పుకునేందుకు పరుగులు పెడుతున్న యార్లగడ్డ వెంకటరావు దుట్టాను కలసి వచ్చారు మరి ఈ ఇద్దరూ ఏమి మాట్లాడుకున్నారో తెలియడంలేదు అని అంటున్నారు. ఇక యార్లగడ్డ ఆదివారం ఏకంగా హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో కలసి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఆయన టీడీపీలోకి దారి తీస్తున్న వేళ వైసీపీలో ఉన్న తన నేస్తం దుట్టాను ఆ వైపునకు నడిపిస్తారా అన్న చర్చ మొదలైంది. సైకిల్ ఎక్కేందుకు ఉత్సాహపడుతున్న యార్లగడ్డకు దుట్టా కూడా తోడు అయితే అది టీడీపీకి రాజకీయ లాభంగా ఉంటుంది. కానీ దుట్టా మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అయితే దుట్టా మీద ఇపుడు వైసీపీ టీడీపీ రెండూ ఫోకస్ పెడుతున్నాయని అంటున్నారు.

నిజానికి దుట్టా మొదటి నుంచి వైఎస్సార్ అభిమాని, ఆయనకు నమ్మిన బంటుగా ఉన్న్నారు. వైఎస్సార్ మరణానంతరం జగన్ వైపు వచ్చారు. జగన్ కి ఈ రోజుకీ దుట్టా గట్టి మద్దతుదారు అని అంటారు. ఆయనను కూడా టీడీపీ వైపు తీసుకురావాలని యార్లగడ్డను టీడీపీ హై కమాండ్ కోరినట్లుగా చెబుతున్నారు.

అయితే దుట్టాకు ఇపుడు టీడీపీలోకి వెళ్ళినా ఏమిటి లాభం అన్నది చర్చకు వస్తోంది. అక్కడ యార్లగడ్డకు టికెట్ కన్ ఫర్మ్ అయింది అని అంటున్నారు. వైసీపీలో ఆయన ఉంటే అధినాయకత్వం ఏదైనా పదవి ఇస్తుందా అన్న చర్చ కూడా ఉంది. నిజానికి వైసీపీ ఎమ్మెల్సీ పోస్టుని యార్లగడ్డకు ఆఫర్ చేసింది అని ప్రచారం జరిగింది. ఆ మాటను యార్లగడ్డ కూడా మీడియా ముఖంగా చెప్పారు.

ఇపుడు అదే పదవిని దుట్టాకు ఇచ్చి ఆయనను పార్టీలో ఉండేలా చూసుకుంటారా అన్నదే చర్చగా ఉంది. ఇక దుట్టా అనుచరులు కూడా ఆయన వైసీపీలోనే ఉండాలని కోరుతున్నారుట. అయితే దుట్టా బలం కూడా కలిస్తేనే 2019 ఎన్నికల్లో యార్లగడ్డ వంశీ మీద గట్టిగా పోరాటం చేశారని అంటున్నారు. ఇపుడు యార్లగడ్డ ఈ వైపుకు వచ్చి దుట్టా వైసీపీలో ఉంటే వైసీపీకి అది బలమని అని అంటున్నారు. అందుకే దుట్టా కోసం టీడీపీ చూస్తోందని అంటున్నారు.

మరి దుట్టా విషయం చూస్తే ఇప్పటికైతే ఏమీ తేల్చడంలేదు అని అంటున్నారు. సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని ఆయన వర్గం వారు అంటున్నారు. అయితే దుట్టా సైకిలెక్కేది లేదని వైసీపీలోనే కొనసాగుతారని అంటున్నారు. అయితే 2014లో పోటీ చేసి గన్నవరంలో పార్టీని పటిష్టం చేసిన దుట్టాకు అధినాయకత్వం తగిన న్యాయం చేయాలని కోరుతున్న వారు ఉన్నారు. మరి ఆ విధంగా వైసీపీ హై కమాండ్ చర్యలు తీసుకుంటే దుట్టా ప్లస్ వంశీ అంటే టీడీపీకి గన్నవరంలో చుక్కలే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News