వైసీపీ ఎమ్మెల్యేల లిస్ట్ మీద బోర్ కొట్టిందా...!?
వైసీపీ ఎమ్మెల్యేల లిస్టులు అంటూ ఇప్పటిదాకా విడతల వారీగా రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పటికి ఆరు విడతలుగా జాబితాలు బయటకు వచ్చాయి
వైసీపీ ఎమ్మెల్యేల లిస్టులు అంటూ ఇప్పటిదాకా విడతల వారీగా రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పటికి ఆరు విడతలుగా జాబితాలు బయటకు వచ్చాయి. సిట్టింగులకు మార్పు చేర్పులు చేశారు. చాలా చోట్ల ఎంపీలుగా ఎమ్మెల్యేలను దించుతున్నారు. అలాగే కొత్త ముఖాలుగా ఇంచార్జిలను కూడా పెడుతున్నారు.
ఈ నేపధ్యంలో ఏడవ జాబితా అదిగో ఇదిగో అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే మొదట్లో వచ్చిన ఉత్సాహం కానీ ఆసక్తి కానీ ఇపుడు కనిపించడం లేదు అని అంటున్నారు. మొదట్లో అయితే ఎవరికి సీట్లు వస్తున్నాయి, ఎవరికి పోతున్నాయి అన్న దాని మీద ఉత్కంఠ ఉండేది, హాట్ డిస్కషన్స్ కూడా నడిచేవి.
ఇపుడు చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడంలేదు అని అంటున్నారు. లిస్టులు చూసిన తరువాత ఒక విధమైన అనాసక్తత కలుగుతోంది అని అంటున్నారు. అదే విధంగా చూస్తే ఒకపుడు తీసుకున్నంత సీరియస్ గా పార్టీలోనూ బయటా తీసుకోవడం లేదు అంటున్నారు. దానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ లిస్టులు మార్పులు చేర్పులు ఇక్కడితో ఆగడంలేదు. ఇంచార్జిలను కొన్ని చోట్ల మార్చారు. మరి కొన్ని చోట్ల మార్చుతామని కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఈ మార్పు చేర్పుల వెనక ఒక ప్రమాణం కొలమానం ఉందా అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఉన్న సిట్టింగులను మార్చి కొత్తగా తీసుకుని వస్తున్న వారిలో కూడా సత్తా ఉన్న వారు కనిపించడంలేదు అన్న టాక్ నడుస్తోంది.
పాత వారు గెలవరు అనుకుంటే వారిని మించిన వారు ఉండాలి కానీ ఆ విధంగా కాకుండా కొత్త ముఖాలను తెస్తున్నారు. వారు పూర్తిగా జనాలకు కొత్తగా ఉంటున్నారు. వారు ఇప్పటికిప్పుడు జనంలోకి వెళ్ళి వారి మద్దతు సంపాదించడం కష్టమవుతోంది. అదే టైం లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా క్యాడర్ వారినే అట్టిపెట్టుకుని ఉంటుంది కానీ కొత్త వారి వైపు వెళ్లడంలేదు.
ఇక టికెట్ ఆశించిన వారిలో ఏ ఒకరికి టికెట్ ఇవ్వడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఆశావహులు ఉండగానే ఎవరూ ఊహించని కొత్త క్యాండిడేట్ ని తెచ్చి పెడుతున్నారు. దాంతో ఉన్న వర్గాలకు తోడు కొత్త పోరు అన్నట్లుగానే ఉంది తప్ప మరే విధంగా అది వైసీపీకి హెల్ప్ కావడం లేదు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఇటు పార్టీ జనాలకు అటు బయట జనాలకు ఆకట్టుకోలేక కొత్త ఇంచార్జిలు ఇబ్బంది పడుతున్నారు. వారు అలా ఇబ్బందులలో ఉండగానే వారి మీద కూడా సర్వేలు చేయిస్తున్నారు. సహజంగానే వారి పట్ల వ్యతిరేకతనే సర్వే ఫలితాలలో వస్తోంది.
దానిని సాకుగా చూపించి ఆశావహులు ఆ సీటు నుంచి వారిని మార్చమని కొత్త డిమాండ్ పెడుతున్నారు. నిజానికి చూస్తే ఆరు జాబితాలు రిలీజ్ అయ్యాయి కానీ వైసీపీ అభ్యర్ధులు గెలుపు గుర్రాలు అన్న ఇంప్రెషన్ అయితే అత్యధిక నియోజకవర్గాలలో మాత్రం క్రియేట్ చేయలేకపోయింది అన్న విమర్శలు ఉన్నాయి. మారుస్తున్న వారిని ఎందుకు మారుస్తున్నారు అన్న ప్రశ్నలు ఉండగానే కొత్తగా తెస్తున్న వారిని ఏ కొలమానంతో తెస్తున్నారు అన్నది కూడా ప్రశ్నలుగా ఉంటున్నాయి.
దీంతో అనవసరంగా కదుపుకుని కొత్త రెబెల్స్ ని ప్రతీ నియోజకవర్గంలో పెంచుకుంటున్నారా అన్న చర్చకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది. ఎన్నికలకు చాలా ముందుగానే లిస్ట్ లను ప్రకటించి అభ్యర్ధులను డిసైడ్ చేయడం వల్ల పార్టీ పటిష్టంగా ఉంటుంది. వారు జనం మెప్పు పొందుతారు అని పెట్టుకున్న అంచనాలు కూడా ఏ మేరకు నెరవేరుతున్నాయో కూడా అర్ధం కాని పరిస్థితి.
దాంతో వైసీపీ జాబితాల మీద మెల్లగా ఆసక్తి తగ్గిపోతోంది అని అంటున్నారు. ఇక ఏడవ జాబితాలో చాలా పేర్లు ఉంటాయని ప్రచారం సాగుతోంది. అయినా సరే పెద్దగా ఎవరూ దృష్టి పెట్టడంలేదు. ఇంకో వైపు వైసీపీకి ఓటు వేయాలంటే జగన్ ని చూసే ఎవరైనా వేస్తారు. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లుగా జగన్ మరోసారి సీఎం కావాలా వద్ద అన్న దాని మీదనే ఎన్నికలు జరుగుతాయి.
అందువల్ల ఉన్న వారినే ఎక్కువ మందిని కంటిన్యూ చేస్తూ ఎన్నికలకు వెళ్తే సరిపోయేది అన్న మాట కూడా వినిపిస్తోంది. మరీ తలకాయ నొప్పి లాంటి చోట్ల మార్పు చేర్పులు చేయవచ్చు కానీ వందకు పైగా సీట్లలో మార్చడం వల్ల లాభం కంటే నష్టమే ఉంటుందా అన్న యాంగిల్ లో కూడా చర్చ సాగుతోంది. అందుకే వైసీపీ లిస్ట్ ఇపుడు బోర్ కొడుతోంది అని అంటున్నారు.