ఇదేంది బాబాయ్...వైసీపీకి సీనియర్లు డుమ్మా!
వైసీపీ ఓటమి పాలు కాగానే అసలు రంగు బయటపడుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది.
వైసీపీ ఓటమి పాలు కాగానే అసలు రంగు బయటపడుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి విశాఖ వచ్చి మీటింగ్ పెడితే సీనియర్లు అంతా డుమ్మా కొట్టడం విశేషం. మంత్రులుగా చేసిన వారు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నవారు అంతా కూడా పార్టీకి దూరంగా ఉన్నారు.
వైఎస్సార్ జయంతి వేడుకలను కూడా చాలా చోట్ల పార్టీ పిలుపు మేరకు నిర్వహించలేదని తెలిసింది. చాలా మంది నేతలు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని అంటున్నారు. కొంతమంది నేతలు అయితే ఫోన్లు చేసినా పలకడం లేదు అని అంటున్నారు. ఇదీ విశాఖలో వైసీపీ పరిస్థితి అని అంటున్నారు.
వైవీ సుబ్బారెడ్డి రెండేళ్ల నుంచి విశాఖ వైసీపీని నడిపిస్తున్నారు. ఆయన రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతలు స్వీకరించాక పార్టీ మరింతగా తీసికట్టు అయింది అన్న విమర్శలు ఉన్నాయి. కొందరికి కొమ్ము కాస్తూ చాలా మందిని దూరం చేసుకున్నారని నేతలు ఎవరు అయినా ఆనాడు ఫోన్ చేస్తే ఎత్తకుండా వారిని దూరం పెట్టారని ఇపుడు అదే పరిస్థితి నేతల నుంచి జగన్ బాబాయ్ కి ఎదురవుతోందని అంటున్నారు.
పార్టీ ఓటమి పాలు అయ్యాక మాజీ మంత్రులు అవంతి శ్రీనివాసరావు,తో పాటు విశాఖ డైరీ చైర్మన్ గా ఉండి విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసిన ఆడారి ఆనంద్ వంటి వారు దూరంగా ఉన్నారని అంటున్నారు. విశాఖ తూర్పు నుంచి మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అయితే వైసీపీతో సంబంధం లేనట్లుగా వ్వవహరిస్తున్నారు అని అంటున్నారు.
రూరల్ జిల్లాలో చూస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు. చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రెస్ మీట్ పెట్టి మరీ అధినాయకత్వం తీరుని పూర్తిగా తప్పు పట్టారు. ఏజెన్సీలో కూడా మాజీ ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు.
దీంతో వైసీపీలో ఎవరు ఉంటారు వేరు వెళ్తారు అన్నది కూడా తెలియడం లేదు అని అంటున్నారు. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా మీటింగ్స్ కి గైర్ హాజరయ్యారు. ఇక వైసీపెలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అనేకమంది అయితే పత్తా లేరు. ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు కూడా ఇపుడు మా అవసరం వచ్చిందా అని నిగ్గదీసే పరిస్థితి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా చేసుకున్న్ అ వారికి చేసుకున్నంత అన్నట్లుగా వైసీపీలో సీన్ ఉంది అంటున్నారు.