ఆ నియోజకవర్గాల్లో వైసీపీ జనం జువ్వలు కొనేసుకుంటున్నారంట!

"అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు" ఒక తెలుగు సినిమాలో డైలాగ్

Update: 2024-02-24 13:30 GMT

"అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు" ఒక తెలుగు సినిమాలో డైలాగ్. ప్రస్తుతం టీడీపీ నుంచి పాయకరావుపేట టిక్కెట్ దక్కించుకున్న ఆ పార్టీ మహిళానేత వంగలపూడి అనిత గురించి నెట్టింట జరుగుతున్న చర్చ ఇదే! ఈసారి ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై వంటివనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఈసారి జనసేనతో పొత్తులో ఉండటంతో ఇక సీట్ల సర్దుబాటులో చాలా మంది కాస్త అటు ఇటుగా ఉన్న నేతల టిక్కెట్లు గల్లంతు అనే మాటలూ వినిపించాయి.

అయితే ఊహించని విధంగా ఇప్పటికే పలుమార్లు గెలిచిన నేతల నియోజకవర్గాల పేర్లు సైతం మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో... అనూహ్యంగా వంగలపూడి అనితకు టిక్కెట్ దక్కింది! గెలుపు సంగతి దేవుడెరుగు.. ముందు ఫైనల్ లిస్ట్ లో చోటు దక్కడం అనేది అటు క్రీడాకారులకు అయినా, ఇటు రాజకీయ నాయకులకైనా పెద్ద సక్సెస్ అనే భావించాలి. పెర్ఫార్మెన్స్, రిలజ్ట్ సంగతి తర్వాత! ఈ క్రమంలో క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నుంచి అఖిల‌ప్రియ‌ విషయంలోనూ ఇదే కామెంట్ వినిపిస్తుంది!

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్లుగా తాజాగా టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా తొలివిడత విడుదలయ్యింది. ఇందులో భాగంగా 175 లోనూ 24 సీట్లు జనసేనకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటన చేశారు. దీని తర్వాత జనసేనలోనూ, కాపు సామాజికవర్గంలోనూ జరుగుతున్న చర్చ సంగతి కాసేపు పక్కనపెడితే... టీడీపీ ప్రకటించుకున్న 94 స్థానాల్లోనూ ఊహించని పేర్లు తెరపైకి వచ్చానే కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... అఖిల ప్రియకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని ఇప్పటికే భూమా కుటుంబ సభ్యులు ప్రకటించారు. తాజా ప్రకటనతో వారు ఆ పనిలోకి దిగారని తెలుస్తుంది. పైగా ఇటీవల అఖిల ప్రియ & కో వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడం, తీవ్ర వివాదాస్పదమవ్వడం తెలిసిందే! దీంతో... ఇంత కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు రిస్క్ చేయరనే కామెంట్లు టీడీపీ కార్యకర్తల నుంచే వినిపించాయి. అయితే అనూహ్యంగా చంద్రబాబు మాత్రం ఆళ్లగడ్డ నుంచి అఖిల ప్రియే బరిలో ఉంటుందని ప్రకటించేశారు.

ఇక పాయకరావుపేట విషయానికొస్తే... ఇటీవ‌ల జ‌న‌సేన ప్రధాన కార్యద‌ర్శి నాగ‌బాబు.. పాయ‌క‌రావుపేట టీడీపీ ఇన్‌ చార్జ్ వంగ‌ల‌పూడి అనిత‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనిత‌కు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామ‌ని జ‌న‌సేన నాయ‌కులు నేరుగా నాగ‌బాబుకే తేల్చి చెప్పిన పరిస్థితి! అయినప్పటికీ పాయకరావుపేట టిక్కెట్ సాధించారు అనిత. దీంతో... జనసేన నాయకులకు అనిత పనిపెట్టినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలా అటు ఆళ్లగడ్డలోనూ, ఇటు పాయకరావు పేటలోనూ వైసీపీ కార్యకర్తలు ఆల్ రెడీ అవుట్లు, తారాజువ్వలూ కొనేస్తున్నారనే కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి! మరి ఎంతో నమ్మకంతో టిక్కెట్లు ఇచ్చిన చంద్రబాబు నమ్మకాన్ని వీరిద్దరూ నిలబెడతారా... లేక, ఎంతో నమ్మకంతో ఇప్పటినుంచే జువ్వలూ, బాంబులూ కొనేసుకుంటున్న వైసీపీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెడతారో వేచి చూడాలి!!

Tags:    

Similar News