రౌండ్లు మీద రౌండ్లు వేస్తోన్న ఏపీ మంత్రులు.. విషయం ఇదేనా..!
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు జిల్లాలను చుట్టేస్తున్నారు. ఆ మంత్రి, ఈ మంత్రి అనే తేడా లేకుండా.. ఒక్క ముఖ్యమంత్రి జగన్ మినహా అందరు మంత్రులు కూడా.. జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు జిల్లాలను చుట్టేస్తున్నారు. ఆ మంత్రి, ఈ మంత్రి అనే తేడా లేకుండా.. ఒక్క ముఖ్యమంత్రి జగన్ మినహా అందరు మంత్రులు కూడా.. జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఆయా నియోజ కవర్గాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులపురోగతి, నాయకుల మధ్య ఉన్న అసంతృప్తులను తొలగిం చేలా .. వారు చర్యలు చేపడుతున్నారు. అయితే.. దీని వెనుక వ్యూహం ఏంటంటే.. నియోజకవర్గాల్లో చెలరేగుతున్న అసంతృప్తిని అంతో ఇంతో అయినా.. తగ్గించాలనే!
కానీ, ఈ దిశగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఫలించేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. క్షేత్రస్థాయి లో మంత్రులకు సెగ తగులుతోంది.సమీక్షా సమావేశాల్లోనే చాలా మంది మంత్రులకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్యేలు తమపై పెత్తనం చేస్తున్నారంటూ.. సర్పంచులు.. ఆరోపిస్తున్నారు. ఇక, మండల స్థాయిలోనూ ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిధుల కోసం సర్పంచులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
తమకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా అందకుండా చేస్తున్నారని మెజారిటీ వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న సర్పంచులు కూడా ఆందోళనకు దిగుతున్నారు. ఇక, ఎమ్మెల్యేలు కొందరు ఈ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. అనారోగ్య కారణాలతో వారు సమీక్షలకు రావడం లేదు. కానీ, వాస్తవం ఏంటంటే.. తమకు టికెట్ దక్కుతుందో లేదో.. అనే బెంగ వారిని వెంటాడుతుండడం. వారిపైనే ఫిర్యాదులు ఎక్కువగా అందుతుండడంతో మంత్రులను కూడా తప్పించుకుని తిరుగుతున్నారు.
దీంతో జిల్లాలను చుట్టేస్తున్నప్పటికీ.. వైసీపీ అధినేత, సీఎం జగన్ నిర్దేశించిన రిజల్ట్‌ను మాత్రం మంత్రులు అందుకోలేక పోతున్నారు. ఎక్కడికక్కడ పెరుగుతున్న అసంతృప్తులను వారు నిలువరించే ప్రయత్నం చేస్తున్నా.. ఫలించడం లేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి నత్తనడకన సాగుతోంది. అదేసమయంలో తాగునీటి సమస్య ఎక్కడికక్కడే ఉండిపోయింది. ఈ పరిణామాలతో మంత్రులు కూడా ఈ సమీక్షలను మొక్కుబడిగా నిర్వహించి.. చేతులు దులుపు కొంటున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.