వాసుపల్లిని గోడమీద పిల్లి అంటున్నదెవరు...?

విశాఖ సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచారు.

Update: 2023-11-05 03:31 GMT

విశాఖ సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచారు. 2014, 2019లలో ఆయన సైకిల్ గుర్తు మీద గెలిచినా 2020లో మాత్రం వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అంటే వైసీపీయే అని బయటకు వినిపిస్తున్న మాట.

వాసుపల్లి కూడా వైసీపీ తరఫునే ఇపుడు గట్టిగా తిరుగుతున్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడిన తరువాత మారే రాజకీయాన్ని అంచనా వేసుకుని ఆయన సొంత పార్టీ కోసం సైకిల్ ఎక్కేస్తారు అని అంటున్నారు. ఈ మాట ఎక్కువగా అంటున్నది వైసీపీ వారే అని కూడా ప్రచారం సాగుతోంది.

ఇక వాసుపల్లి గోడ మీద పిల్లి అని ఆయన ఎన్నికల టైం కి ఏ పార్టీలో ఉంటారో అని వైసీపీలో ఉన్న నాయకులు ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. విశాఖ సౌత్ సీటు మీద విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ కోలా గురువులు కన్నేశారు. అదే విధంగా చూస్తే బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ కూడా వాసుపల్లి వైసీపీలోకి రాకను వ్యతిరేకిస్తున్నారు.

ఆయనకు ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ్కాశం ఇచ్చినా ఓటమి పాలు అయ్యారు. దాంతో ఎమ్మెల్యే గా పోటీ మీదనే దృష్టి సారించారు. దీంతో విశాఖ సౌత్ లో ఈ ఇద్దరి మధ్య పోరు ఒక లెవెల్ లో సాగుతోంది. ఈ నేపధ్యంలో ఇటీవల విశాఖ వచ్చిన సీఎం జగన్ సైతం ఇద్దరినీ పిలిచి చెప్పాల్సింది చెప్పారని ప్రచారం సాగుతోంది.

ఈ నేపధ్యంలో ఉన్నట్లుండి పోస్టర్ల కలకలం విశాఖ సౌత్ లో రేగింది. వాసుపల్లి ఈసారి ఏ పార్టీలోకి జంప్ అంటూ పోస్టర్లలో రాశారని అంటున్నారు. అలాగే ఆయన రాజకీయంగా నిలకడ లేని తత్వం కలవారు అని కూడా రాశారు. దీని మీద విశాఖ సౌత్ లో చర్చ సాగుతోంది. ఇదంతా వాసుపల్లి అంటే వైసీపీలో గిట్టని వర్గాలు చేసిన పని అని కూడా అనుకుంటున్నారు.

అయితే వాసుపల్లి మీద పోస్టర్లు వేయడం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల లాభం ఎవరికి అంటే వైసీపీలో వర్గ పోరు వల్ల చివరికి టీడీపీకే లాభం అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడే బిగ్ ట్విస్ట్ కూడా ఉంది అని అంటున్నారు.

వాసుపల్లి మీద పోస్టర్లు వేయించింది వైసీపీలోని ప్రత్యర్ధి వర్గం కాదని టీడీపీ వారి పనే అయి ఉంటుందని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారుట. ఏది ఏమైనా ఎమ్మెల్యే వాసుపల్లి నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతున్నారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. అయితే రెండు సార్లు గెలిచిన మీదటన వచ్చే ప్రజా వ్యతిరేకత ఆయన మీద ఎక్కువగా ఉందని అంటున్నారు.

అదే టైం లో వాసుపల్లిని వైసీపీలో ఓడించాలని చూస్తున్న వారు ఉంటే టీడీపీ ఎటూ బాహాటంగా ఓడిస్తుంది అని అంటున్నారు. మరి ఈసారి గెలుపు మార్గం కోసం వాసుపల్లి ఏమి చేస్తారు అన్నది చర్చ. ఆయన కనుక పార్టీ మారితే ఎందులోకి వెళ్తారు, ఈసారి టీడీపీలోకేనా లేక జనసేన లోకా అన్న చర్చ కూడా సాగుతోందిట. మొత్తానికి వాసుపల్లిని గోడ మీద పిల్లిగా చేసి పారేస్తున్నారు.

Tags:    

Similar News