సామాజిక న్యాయం... నినాదం కాదు జగన్ విధానం!
అవును... సమాజంలో ఉన్న అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలూ బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్లు అనేదే తన విధానం అన్నట్లుగా జగన్ పాలన సాగిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు
"సమాజంలో ఉన్న అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలూ బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్లు" స్వాతంత్రం వచ్చినప్పటినుంచి వింటున్న మాట ఇది! మాటలు చెప్పే నాయకులే కానీ చేతల్లో చూపించిన నాయకులు కనిపించిన దాఖలాలు లేవనే విమర్శలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.. వాటి తాలూకు ఫలితాలు నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి! సామాజిన న్యాయం, సామాజిక సాధికారత వంటి మాటలు గత పాలకులకు నినాదాలుగా మాత్రమే మిగిలిపోయిన తరుణంలో... ఇది నినాదం కాదు తన విధానం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరూపించారని అంటున్నారు పరిశీలకులు!
అవును... సమాజంలో ఉన్న అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలూ బాగుంటేనే రాష్ట్రం బాగున్నట్లు అనేదే తన విధానం అన్నట్లుగా జగన్ పాలన సాగిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. గడిచిన 53 నెలల తన తొలి పాలనలో చేతల్లో కనిపించిన సామాజిక సాధికారత విప్లవమే దీనికి సాక్ష్యం అని చెబుతున్నారు. ఈ సమయంలో... ఈ 53 నెలల్లోనూ జగన్ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు డీబీటీ, నాన్ డీబీటీల రూపంలో అందించిన ఆర్ధిక సహాయం దీనికి ఒక ఉదాహరణ అని క్లారిటీ ఇస్తున్నారు.
గడిచిన 53 నెలల కాలంలో డీబీటీ ద్వారా రూ. 2.38 లక్షల కోట్లు నేరుగా లద్భిదారుల ఖాతాల్లోకి వెళ్లగా.. ఇందులో 75శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చేరాయని ఏపీ ప్రభుత్వం సగర్వంగా చెబుతుంది. ఇదే సమయంలో... నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో. రూ. 1.67 లక్షల ప్రయోజనం చేకూరిందని ఘణాంకాలతో సహా వివరిస్తుంది. దీంతో.. సున్నా శాతం అవినీతితో ఇలాంటి పథకాలు రావడం దేశంలో ఇదే తొలిసారి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇదే సమయంలో కేబినెట్ పదవుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సింహ భాగం పదవులు కట్టబెట్టిన ఏకైక ప్రభుత్వం కూడా ఇదే అని అంటున్నారు విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో చారిత్రక విజయం అనంతరం 25 మందితో ఏర్పాటైన కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు 14 మంది (56 శాతం) స్థానం కల్పించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే... అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలవారే ఉండటం... దేశ చరిత్రలో ప్రధమం అని అంటున్నారు పరిశీలకులు. ఇక శాసనసభ స్పీకర్ గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంని నియమించగా... శాసనమండలి ఛైర్మన్ గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషెన్ రాజు ని నియమించారు జగన్. ఇది జగన్ విధానానికి మరో ఉదాహరణ!
ఇదే క్రమంలో 2022, ఏప్రిల్ 11న పునర్వవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం విషయంలో జగన్ మరో అడుగు ముందుకేశారనే చెప్పుకోవాలి. కారణం... ఆ జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని ఏకంగా 17 మందికి కొత్త మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అందుకే... సామాజిక న్యాయం అనేది జగన్ నినాదం కాదు.. విధానం!
ఇక గత ప్రభుత్వ హయాంలో రాజ్యసభకు ఒక్క బీసీ నేతను కూడా పంపకపోగా... వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వచ్చిన కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను వైఎస్ జగన్... రాజ్యసభకు పంపించారు. ఇక శాసన మండలి విషయానికొస్తే... వైసీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 29మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే ఉండటం గమనార్హం.
ఇలా ఒకటేమిటి... స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించగా.. రాష్ట్రంలో 37శాతం మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చారు వైఎస్ జగన్. ఇక 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో ఒక్క బీసీలకే ఆరుపదవులు ఇచ్చిన జగన్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 9 జెడ్.పీ.టీ.సీ. ఛైర్మన్ పదవులు ఇచ్చారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని 14 మున్సిపల్ కార్పొరేషన్ లలో 9 మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకుంటే మొత్తం 12 పదవులు వారికే ఇచ్చారు!
ఇదే సమయంలో డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ 53 నెలల పరిపాలనలో 12 కోట్ల 66 లక్షల 34 వేల 568 ప్రయోజనలద్వారా చేకూరిన లబ్ధి 4 లక్షల 05 వేల 343 కోట్ల రూపాయలు కాగా... ఇందులో డీబీటీ, నాన్-డీబీటీ ద్వారా బీసీ వర్గాలకు చేకూరిన లబ్ధి మొత్తం... రూ. 1,62,593.06 కోట్లు!
ఇక, ఎస్సీలకు అందిన చేకూరిన లబ్ధి రూ.60,964.73 కోట్లు కాగా... ఎస్టీలకు రూ. 17,134.84 కోట్లు, మైనారిటీలకు రూ. 20,114.09 కోట్లు, కాపులకు రూ. 29,799.74 కోట్లు, ఇతర పేదలకు రూ. 1,14,737.01 కోట్లు మేర లబ్ధి చేకూరింది. దీంతో... ఇంతకు మించిన సామాజిక న్యాయం, సామాజిక సాధికారత ఉంటుందా అనేది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది!
నేటి నుంచి సామాజిక సాధికార బస్సు యాత్ర:
తాను చేసిన సామాజిక న్యాయం గురించి ప్రజలకు మరింగా వివరించేందుకు వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రోజు ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతీరోజూ మూడు ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ యాత్ర జరుగుతుంది. అనంతరం ఆ రోజు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తారు!