నాడు సీఐ గోరంట్ల మాధవ్‌ కు.. నేడు ఇంకో సీఐకి వైసీపీ సీటు!?

కాగా రాయలసీమలో కీలకమైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే జగన్‌ అనేక మార్పులు చేశారు

Update: 2024-01-16 06:33 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభ్యర్థుల స్థానాల్లో మార్పులుచేర్పులు సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలు, 9 లోక్‌ సభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

కాగా రాయలసీమలో కీలకమైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే జగన్‌ అనేక మార్పులు చేశారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ప్రస్తుతం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్‌ ను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్‌ కు సీటు నిరాకరించారు. ఈ స్థానంలో కర్ణాటక మాజీ మంత్రి బి.శ్రీరాములు సోదరి శాంతకు సీటిచ్చారు.

ఇదే కోవలో మడకశిర సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామికి ఈసారి సీటు నిరాకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి ఒక సీఐని బరిలోకి దింపుతారని టాక్‌ నడుస్తోంది. శుభకుమార్‌ అనే సీఐ పలు ప్రాంతాల్లో ఎస్‌ఐగా, సీఐగా విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మడకశిర సీటు లభిస్తుందని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే సీఐ శుభకుమార్‌ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గత ఎన్నికల్లోనూ ఇలాగే హిందూపురం నుంచి అప్పటిగా సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్‌ కు జగన్‌ సీటిచ్చారు. వైసీపీ గాలిలో మాధవ్‌ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు ఇదే కోవలో సీఐ శుభకుమార్‌ కు కూడా సీటిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం మడకశిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిని వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపొచ్చని టాక్‌ నడుస్తోంది. మడకశిర ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం. గతంలో ఈ నియోజకవర్గం జనరల్‌ గా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ తరఫున రఘువీరారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఈరన్న విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి గెలుపొందారు. 2009లో మడకశిర నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గంగా మారింది.

ఈ నేపథ్యంలో సీఐ శుభకుమార్‌ కూడా నాటి సీఐ గోరంట్ల మాధవ్‌ లాగా విజయం సాధిస్తారో, లేదో వేచిచూడాల్సిందే. అలాగే ప్రస్తుతం మడకశిర సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామికి ఎక్కడ సీటు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News