వైసీపీ స్టార్ క్యాపెయినర్ గా చంద్రబాబు... థాంక్స్ చెబుతున్నారుగా!
ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వృద్ధులకు, వికలాంగులకు వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించే అవకాశం లేకుండా.. చంద్రబాబు తన అనునయులతో అడ్డుకున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఇదే క్రమంలో పలువురు పెన్షన్ దారుల వీడియోలను వైరల్ చేస్తూ టీడీపీని ఇరుకునపెడుతోంది. దీంతో... ఈ విషయంలో వైసీపీ నుంచి వస్తోన్న ప్రతీ విమర్శకూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చిందని అంటున్నారు.
ఈ సమయంలో సిటిజన్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది టీడీపీ అనుబంధ సంస్థ.. అందులోని సభ్యులంతా చంద్రబాబు అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అని.. వారిలో ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ముందుపెట్టి ఇదంతా చంద్రబాబు నడిపించిన కథ అంటూ వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పెన్షన్ దారులు పడుతున్న బాధలే వారి ఆగ్రహానికి కారణం అని చెబుతున్నారు!
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బులు ఇంటింటికీ పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే! దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది! ఇందులో భాగంగా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వ్యులు జారీచేస్తూ.. ప్రత్యామ్నాయ చార్యలు చేపట్టాలని సూచించింది.
దీంతో... 3వ తేదీ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది! ఈ నేపథ్యంలో... ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్స్ అందజేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీ నేతలు సీఎస్ జవహార్ రెడ్డిని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 1.26 లక్షల మంది సచివాలయ శాస్వత ఉద్యోగులు ఉన్నారని.. వారితో పెన్షన్స్ ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది!
ఈ విషయంపైనా వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బుడి బుడి దుఖఃం తీస్తున్నారని విమర్శలు గుప్పించారు. వృద్ధులపై అంత ప్రేమ ఉంటే... ఆ పని ఎందుకు చేశారంటూ నిలదీస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపింది. అందుకు రెండు కారణాలను కూడా వెల్లడించింది!
ఇందులో భాగంగా... రాష్ట్రంలో వాలంటీర్ల విలువ తెలియజేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సమయంలో... జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క సచివాలయం ద్వారానే 1.26 లక్షల మందికి ప్రభుత్వ శాస్వత ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని అంగీకరించినందుకు ధన్యవాదాలు అని పేర్కొంది. అవ్వాతాతలు కిలోమీటర్ల మేర వెళ్లి పెన్షన్ తీసుకోవాల్సిన అవస్థ లేకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే వాలంటీర్ల వ్యవస్థను జగన్ ముందుచూపుతో ప్రవేశపెట్టారని నొక్కి చెప్పింది.
ఇలా వాలంటీర్ల విలువ ఏమిటో తెలియజేయడంతోపాటు.. జగన్ హయాంలో ఒక్క సచివాలయ వ్యవస్థలోనే ఒక లక్షా ఇరవై ఆరు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్న విషయాన్ని ప్రజలకు మరింత స్పష్టంగా తెలియచేసిన చంద్రబాబుకు థాంక్స్ అంటూ.. ఆయనను వైసీపీ ఎలక్షన్ క్యాపెయినర్ గా అభివర్ణించింది.