వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఎందుకీ రగడ...!
అయితే.. ఇంతలోనే వైసీపీ కార్యాలయాల వ్యవహారం తెరమీదికి వచ్చింది. వైసీపీ కార్యాలయాలను కూల్చి వేసే పరిస్థితి వచ్చింది
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చారు. అయితే.. ఇంతలోనే వైసీపీ కార్యాలయాల వ్యవహారం తెరమీదికి వచ్చింది. వైసీపీ కార్యాలయాలను కూల్చి వేసే పరిస్థితి వచ్చింది. శనివారం ఉదయం వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చి వేశారు. ఇది రగడకు దారి తీసే పరిస్థితి నెలకొన్న దరిమిలా.. అధికారులను రంగంలోకి దించిన చంద్రబాబు వారితోనే వివరణ ఇప్పించారు. ఇక, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు ఎక్కడెక్కడ కడుతున్నారో తెలుసుకుంటున్నారు.
ప్రతిజిల్లాలోనూ వైసీపీ కార్యాలయం కడుతున్నట్టు తెలుసుకున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వం వాటికి సంబంధించిన అనుమతులు కూడా తెప్పించుకునే పనిలో పడింది. వాటికి అనుమతులు ఉన్నాయా? లేవా అని సరి చూసుకుంటోంది. వాస్తవానికి గత ప్రభుత్వం కూడా చాలా ఆచితూచి అనుమతులు తెచ్చుకుని ఈ పనులు ప్రారంభించినట్టు సమాచారం. ప్రతి జిల్లాలోనూ ఒకే తరహాలో ఉండేలా వైసీపీ కార్యాలయాల ను రాంకీ సంస్థ నిర్వహిస్తోంది.
ఇది సహజంగా జరిగే తంతే. కొత్త రాష్ట్రం కావడంతో ఏ పార్టీ అయినా..తమ కార్యాలయాలు కట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అధికారంలో ఉంటే.. సొంతగానే భూములు కేటాయించుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. గతంలో చంద్రబాబు పాలనలో జిల్లాకో కార్యాలయం కోసం భూములు కేటాయించుకున్నారు. కొన్ని చోట్ల నిర్మాణాలుపూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల ఆగాయి. తర్వాత.. వచ్చిన వైసీపీ సర్కారు.. ఆ భూముల జోలికికానీ.. కార్యాలయాల జోలికి కానీ పోలేదు.
ఎందుకంటే.. తాను కూడా.. ప్రతి జిల్లాలోనూ ఒక కార్యాలయ నిర్మాణానికి భూములు కేటాయించుకుంది. దీంతో ప్రతిపక్షంపై ఎందుకు దాడి అని అనుకుంది. కానీ, ఈ వాస్తవాలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ తెలియదు. తాజాగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంతో వైసీపీ సోసల్ మీడియా ఇటు టీడీపీ కార్యాలయాలపై పోస్టులు పెడుతోంది. అటు టీడీపీ సర్కారు అనుకూల మీడియా వైసీపీ కార్యాలయాల ఫొటోలను పెట్టుకుని విమర్శించుకుంటున్నాయి. కానీ, ఈ విమర్శల వల్ల వచ్చేది ఏమీ లేదు. ఎవరికి వారు.. కార్యాలయాలు కట్టుకునేందుకు సిద్ధమైనప్పుడు.. ఎవరు మాత్రం ఏం చేస్తారు. కానీ, ప్రస్తుతం మాత్రం రచ్చ జరుగుతుండడం గమనార్హం.