షర్మిలకు ఆహ్వానం
ఇంతకీ పార్టీ విలీనం, ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందనే విషయమై షర్మిల ఇంతవరకు ఎక్కడా నోరిప్పలేదు
వైఎస్ షర్మిలకు పదేపదే ఆహ్వానాలు అందుతున్నాయి. ఎక్కడినుండి అంటే ఏపీ కాంగ్రెస్ నుండి. షర్మిలను ఏపీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రాద్రరాజు ప్రకటించారు. ఇదే విషయంలో గతంలో కూడా రుద్రరాజు షర్మిలకు ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. షర్మిల పార్టీలోకి రావటాన్ని తామంతా సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు గిడుగు చెప్పారు. షర్మిల పార్టీలో చేరటం వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందనే తాము అనుకుంటున్నట్లు చెప్పారు.
గిడుగే కాదు వివిధ స్ధాయిల్లోని మరికొందరు నేతలు కూడా షర్మిలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం తర్వాత ఆమె పూర్తిస్ధాయి తెలంగాణాలోనే ఉండబోతున్నారు. ఏపీ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టేది లేదని సోనియాగాంధి, రాహుల్ తో షర్మిల స్పష్టంగా చెప్పేశారట. తన భవిష్యత్తు మొత్తం తెలంగాణాలోనే ఉంటుందని క్లారిటితో చెప్పారట.
దానికి సోనియా, రాహుల్ కూడా ఆమోదించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే షర్మిల ఎంట్రీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ లో ఆమె పార్టీని విలీనం చేయటాన్ని స్వాగతించారు. అయితే ఆమె రాజకీయం మొత్తం ఏపీలోనే చేసుకోవాలని అధిష్టానంతో గట్టిగా చెప్పారట. ఇదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి కొందరు నేతలు మాత్రం షర్మిల ఎంట్రీతో తెలంగాణా కాంగ్రెస్ బలోపేతమవుతుందని అంటున్నారు. అంటే తెలంగాణా కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీపై మిశ్రమస్పందన కనబడుతోంది.
ఇంతకీ పార్టీ విలీనం, ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందనే విషయమై షర్మిల ఇంతవరకు ఎక్కడా నోరిప్పలేదు. అందుబాటులోని సమాచారం ప్రకారం ఆమె తెలంగాణాలోనే ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఎక్కడా పోటీచేయరని, అభ్యర్ధుల విజయానికి స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రమంతా తిరుగుతారని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈరోజు అంటే బుధవారం కాంగ్రెస్ లో షర్మిల పార్టీలో విలీనం అయిపోతుందని ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో వాయిదాపడినట్లుంది. మరి విలీనం ఎప్పుడు, వివాదాలకు ఫులిస్టాప్ ఎప్పుడో షర్మిలే చెప్పాలి.