డోలాయమానంలో షర్మిల పాలిటిక్స్....!

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయం అనిశ్చితిలో పడింది. ఆమె తెలంగాణా రాజకీయం ఎటూ కాకుండా పోతోంది.

Update: 2023-09-24 12:22 GMT

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయం అనిశ్చితిలో పడింది. ఆమె తెలంగాణా రాజకీయం ఎటూ కాకుండా పోతోంది. అదే టైం లో కాంగ్రెస్ లో ఆమె పార్టీ విలీనం ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఆమె ఇపుడు ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది.

తెలంగాణాలో రాజకీయంగా బలపడాలని షర్మిల చూస్తున్నారు. అక్కడే తన రాజకీయ జీవితాన్ని కొనసాగించాలని కూడా చూస్తున్నారు. డిసెంబర్ లో జరిగే తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆమె భావిస్తున్నారు.

అయితే ఆమె తెలంగాణా కాంగ్రెస్ లో చేరి రాజకీయాలు చేయడానికి టీ కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవడంలేదు, ప్రత్యేకించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే షర్మిల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె కనుక ఎంట్రీ ఇస్తే తెలంగాణా సెంటిమెంట్ ని బీయారెస్ రెచ్చగొడుతుందని కూడా ఆయన హై కమాండ్ కి చెబుతూ వస్తున్నారు.

ఇపుడు అదే జరుగుతోంది. ఇప్పటికే బీయారెస్ మంత్రి కేటీయార్ అయితే టీ కాంగ్రెస్ నేతలు ఆంధ్రా నుంచి షర్మిల, కేవీపీ రామచంద్రరావు లాంటి వారిని అరువు తెచ్చుకుని రాజకీయాలు చేస్తున్నారు అని విమర్శలు చేశారు. ఇపుడు చూస్తే షర్మిలను తెలంగాణా కాంగ్రెస్ లో చేర్చుకుంటే నిజంగా ఆంధ్రా వారిని తెచ్చి పెడుతున్నారు అని మరింతగా బీయారెస్ కామెంట్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే షర్మిలను తెలంగాణా సహా ఏపీ ఎన్నికలలో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వైఎస్సార్టీపీని విలీనం చేయడం ద్వారా షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చూస్తోంది అంటున్నారు. ఇక షర్మిల తెలంగాణాలో చేపట్టిన మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల మెగా పాదయాత్రకు అయిన ఆర్ధికపరమైన మొత్తాలని ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ అంగీకరించింది అని ప్రచారం సాగుతోంది.

అయితే షర్మిల ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆమె నిర్ణయం ఏమి తీసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరో వైపు ఆమె పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. షర్మిల తన స్వార్థం కోసం కాంగ్రెస్ కి పార్టీని అప్పగించి తమకు గాలికి వదిలేశారు అన్న బాధతో ఆవేదనతో వారు ఉన్నారు అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే కేవలం షర్మిలకు మాత్రమే రాజ్యసభ హామీ ఇచ్చి ఆమెతో పాటు పార్టీలో ఉన్న వారికి ఎవరికీ తెలంగాణాలో టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరించలేదని అంటున్నారు. దాంతో ఆమె వెనక ఉన్న జానపద గాయకుడు ఏపూరి సోమన్న తాజాగా బీయారెస్ లో కేటీయార్ సమక్షంలో చేరిపోయారు. అదే దారిలో మరింతమంది పట్టే అవకాశం ఉంది.

ఇక షర్మిల తన పార్టీలోని లీడర్స్ ని కాపాడుకుంటూ విలీనం చేస్తేనే ఎంతో కొంత గుర్తింపు వస్తుందని అంటున్నారు. అలా కాకుండా ఆమె సింగిల్ గా వచ్చినా కాంగ్రెస్ తాను ఇస్తానన్న హామీలను నెరవేరుస్తుందా అన్న చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే షర్మిల ఎటూ తేల్చుకోలేని వ్యవహరంతో తన పొలిటికల్ కెరీర్ కి భారీ మూల్యం చెల్లిస్తారా అన్న మాట కూడా వినిపిస్తోంది అంటున్నారు.

Tags:    

Similar News