వైఎస్ఆర్‌టీపీ ఎన్నికల గుర్తు... దాని అవసరం ఉందంటున్న నెటిజన్లు!

దీక్షలకు దిగడం, టీఎస్పీఎస్సీ ముట్టడి, హౌస్ అరెస్టు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం, అరెస్టులు, కేసులు... ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీలను సైతం వెనక్కి నెట్టినంతపనిచేశారు

Update: 2023-10-27 04:06 GMT

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిళ.. పార్టీ పెట్టిన మొదట్లో తెలంగాణలో ఫుల్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె తెలంగాణ అంతటా 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటుచేసిన సభల్లో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యేవారు.

ఈ సమయంలో వైఎస్సార్ ఫ్యామిలీకి దగ్గరగ ఉన్న కొంతమంది తెలంగాణ లీడర్లు, తెలంగాణలోని మాజీ వైసీపీ నాయకులు కొంతమంది షర్మిళకు మద్దతుగా నిలిచారు.. ఆమె వెంట నడిచారు. ఇక టీఎస్పీఎస్సీ ఎన్నికల ప్రశ్నాపత్రాల లీకేజ్ సమయంలో అయితే షర్మిళ పేరు గట్టిగానే వినిపించింది. నిరుద్యోగుల తరుపున ఆమె తన వాయిస్ ని కాస్త గట్టిగానే వినిపించారు.

దీక్షలకు దిగడం, టీఎస్పీఎస్సీ ముట్టడి, హౌస్ అరెస్టు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం, అరెస్టులు, కేసులు... ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీలను సైతం వెనక్కి నెట్టినంతపనిచేశారు. విపక్షాలన్నీ తనతో కలిసి రావాలని పిలుపు కూడా ఇచ్చారు. ఆ స్థాయిలో నడిచిన షర్మిళ రాజకీయం... కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా తిరోగమనం పట్టిందనే చెప్పాలి!

అవును... తెలంగాణలో షర్మిళ రాజకీయాన్ని... కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా విభజించుకోవచ్చు. ఆ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి తానే అన్నస్థాయిలో సందడి చేసిన షర్మిళ... కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే... ఆ పార్టీ కీలక నేత, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వద్ద ప్రత్యక్షమయ్యారు.

ఈ సమయంలో వైఎస్సార్ హయాం నుంచీ వారంతా పరిచయం అని షర్మిల పైకి చెప్పుకున్నా... కాంగ్రెస్ పార్టీలో విలీనం మాటలు వినిపించాయి. అయితే... అందుకు కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్లు సహకరించినా... మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారని అంటుంటారు. దీంతో... చాలా రోజుల సస్పెన్స్ తర్వాత... కాంగ్రెస్ - షర్మిళ రాజకీయం సెట్ అవ్వలేదని తేలింది!

ఈ గ్యాప్ లో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న వైఎస్ అభిమానులు.. షర్మిళ పార్టీకి బై బై చెప్పేశారు! విలీనం వ్యవహారం చెడిన తర్వాత షర్మిళ.. వారంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చినప్పటికీ.. లైట్ తీసుకున్నట్లున్నారు! ఈ సమయంలో 119 నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులు ఒంటరిగా పోటీచేస్తారని షర్మిళ ప్రకటించారు.. ఈసీకి తెలిపారు.

దీంతో... షర్మిళ వైఎస్సారిటీపీ కి ఎన్నికల కమిషన్ ఒక ఉమ్మడి గుర్తు కేటాయించింది. అదే బైనాక్యులర్! అవును... షర్మిళ పార్టీకి ఎన్నికల కమిషన్ బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. ప్రస్తుతం తెలంగాణలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీలలో ఏ ఎన్నికల గుర్తుకూ ఇబ్బంది లేకుండా.. వారితో ఇటువైపు ఇబ్బంది లేకుండా... బైనాక్యులర్ గుర్తు కేటాయించబడింది!

దీంతో కీబోర్డులకు పనిచేబుతున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ తో విలీన ప్రతిపాదనల చర్చలు జరుగుతున్నాయి అనే వార్తలు వచ్చినప్పటినుంచి ఆమె పార్టీని పూర్తిగా వదిలేశారనే విమర్శల నేపథ్యంలో... ఇప్పుడు "నాయకులు, కార్యకర్తలు అనేవారుంటే.. వారంతా ఎక్కడెక్కడున్నారో గుర్తించడానికి ఉపయోగపడుతుందీ గుర్తు" అని అంటున్నారు నెటిజన్లు. ఇదే సమయంలో "పార్టీ తరుపున పోటీచేయడానికి ఇప్పుడు 119 మంది అభ్యర్థులను వెతికిపట్టుకోవాలంటే... దీని అవసరం ఎంంతైనా ఉంటుంది" అని మరొకరు స్పందిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం.. రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది కానీ... ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీ సింబల్స్ జాబితాలోనే ఈ బైనాక్యులర్ గుర్తు అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో... ఒకవేళ ఈ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ కనీసం 5 శాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే.. ఈ ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఈసీ క్లారిటీ ఇచ్చింది!! దీంతో (ఈ గుర్తుతో) షర్మిళకు పెద్దపనే పడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News